భారత్ వేదికగా ఈ ఏడాది (2023) చివర్లో వన్డే ప్రపంచకప్ జరగనుంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగబోయే ఈ మెగా టోర్నమెంట్ ముందే దేశంలోని పలు క్రికెట్ స్టేడియాల్ని పునరుద్ధరించాలని నిర్ణయించుకుంది బీసీసీఐ. స్టేడియాలలో కనీస సౌకర్యాలు కూడా ఉండటం లేదని అభిమానులు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐదు క్రికేట్ స్టేడియాల పునరుద్దనకు రూ.500 కోట్లని కూడా కేటాయించింది బీసీసీఐ. కాగా, ఈ ఐదు స్టేడియాల్లో హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం కూడా ఉంది.
భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబరు – నవంబరులో వన్డే ప్రపంచకప్ -2023 జరగనుంది. ఈ మెగా టోర్నీకి బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గౌహతి, హైదరాబాద్, కోల్కతా, లక్నో, ఇండోర్, రాజ్కోట్, ముంబయి, అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. వరల్డ్ కప్ లో భాగంగా మొత్తం 48 మ్యాచ్ లు జరగనున్నాయి. దీంతో, ఢిల్లీతోపాటు హైదరాబాద్, కోల్కతా, మొహాలి, ముంబై స్టేడియాల్లో వసతులను మెరుగుపరచనున్నారు. 2011 వరల్డ్ కప్ ఫైనల్ కు వేదికైన ముంబైలోని వాంఖెడే స్టేడియంలో కనీస వసతులు లేవని ఓ అభిమాని ఫిర్యాదు చేయడంతో ఈ మధ్యే ఇండియా, ఆస్ట్రేలియా వన్డేకు ముందు ఆ స్టేడియాన్ని రెనోవేట్ చేశారు.
ఆ ఐదు స్టేడియాలకు నిధులు..
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం రెనోవేషన్ కోసం రూ.100 కోట్లు కేటాయించిన బీసీసీఐ.. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం కోసం రూ.117.17 కోట్లు, కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం కోసం రూ.127.47 కోట్లు, మొహాలిలోని పీసీఏ స్టేడియం కోసం రూ.79.46 కోట్లు, ముంబయిలోని వాంఖడే స్టేడియం కోసం రూ.78.82 కోట్లని బీసీసీఐ కేటాయించింది. మే 28తో ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచ్లు ముగియనున్నాయి. ఆ తర్వాత స్టేడియాలు రెనోవేషన్ ప్రాసెస్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.