Tuesday, November 26, 2024

తెలంగాణ కాంగ్రెస్ లో చక్కదిద్దే కసరత్తు ప్రారంభం.. దిగ్విజయ్‍‌ను కలిసిన రేవంత్, వీహెచ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విబేధాలు, వర్గపోరును సరిదిద్దే పనిని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఢిల్లీ నుంచే మొదలుపెట్టారు. బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరిన ఆయన, అంతకంటే ముందు ఢిల్లీలోనే పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఏఐసీసీ ఇంచార్జులను కలిశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఇరువర్గాల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తొలుత ఆయన పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డి లక్ష్యంగా పార్టీలోని సీనియర్లు చేస్తున్న ఆరోపణలపై దిగ్విజయ్ సింగ్ రేవంత్ వివరణ తీసుకున్నారు. పార్టీ కోసం చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ సీనియర్లు సహకరించకపోగా అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలిసింది. పీసీసీ అధ్యక్ష పదవిని అప్పగించినప్పటి నుంచి తాను అందరినీ కలుపుకునిపోయేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, సీనియర్లు ఓర్వలేనితనాన్ని ప్రదర్శిస్తున్నారని రేవంత్ చెప్పినట్టు సమాచారం. తనను, తనతో పాటు వచ్చినవారిని చిన్నచూపు చూస్తూ పార్టీకి నష్టం కల్గించేలా చీటికి మాటికి మీడియాలో లీకులు ఇస్తున్నారని ఉదాహరణలతో సహా వివరించినట్టు తెలిసింది.

సీనియర్ల మోకాలడ్డు

రేవంత్‌తో సమావేశం అనంతరం దిగ్విజయ్ సింగ్‌ను పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంత రావు కలిశారు. తెలంగాణ కాంగ్రెస్ విబేధాలను చక్కదిద్దే బాధ్యత దిగ్విజయ్ సింగ్‌కు అప్పగించిన విషయం తెలిసిన వెంటనే ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మీడియాతో మాట్లాడిన వీహెచ్, దిగ్విజయ్ రాకతో పరిస్థితులు చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితిపై అధిష్టానం దృష్టిసారించి దిగ్విజయ్ సింగ్‌ను నియమించిన నేపథ్యంలో సీనియర్ నేతలు తలపెట్టిన సమావేశాన్ని రద్దు చేసుకోవాలని కూడా వీహెచ్ సూచించారు. బుధవారం దిగ్విజయ్‌ను కలిసిన సందర్భంగా సీనియర్ల ఆవేదన, తాను స్వయంగా ఎదుర్కొన్న పరిస్థితుల గురించి చెప్పినట్టు తెలిసింది. రేవంత్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ సీనియర్లను సంప్రదించడం లేదని, వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదని వివరించినట్టు తెలిసింది.

- Advertisement -

రేవంత్ ఏకపక్ష వ్యవహారశైలి

ఈ ఇద్దరిని కలిసిన దిగ్విజయ్ సింగ్ మధ్యాహ్నం తర్వాత ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం టాగోర్ కార్యాలయంలో కో-ఇంచార్జులు బోసు రాజు, రోహిత్ చౌదురిలతో భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆ ఇద్దరు నేతలను అడిగి తెలుసుకున్నారు. ఈ తరహా వర్గపోరు ఏ పార్టీలోనైనా సహజమేనని, తెలంగాణ బీజేపీలోనూ 4 వర్గాలున్నాయని, కానీ మీడియాలో మాట్లాడ్డం కారణంగానే తెలంగాణ కాంగ్రెస్ విబేధాల గురించి చర్చ జరుగుతోందని వారిద్దరూ వివరించినట్టు తెలిసింది. సీనియర్లకు, రేవంత్ వర్గానికి మధ్య నెలకొన్న కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని, ఆ గ్యాప్ సవరించగల్గితే సమస్య పరిష్కారమవుతుందని బోసు రాజు, రోహిత్ చౌదురి చెప్పినట్టు తెలిసింది.

అనుభవంతో పరిష్కారం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంచార్జిగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్‌కు పాతతరం రాష్ట్ర నేతలందరితోనూ పరిచయాలున్నాయి. అందుకే అధిష్టానం ట్రబుల్ షూటర్‌గా ఆయన్ను ఎంపిక చేసి రాష్ట్రానికి పంపించింది. ఏఐసీసీ అప్పగించిన బాధ్యతను ఢిల్లీ నుంచే చేపట్టిన దిగ్విజయ్ సింగ్, తాజా పరిస్థితులపై ముందుగానే కసరత్తు చేసి హైదరాబాద్ చేరుకున్నారు. ఒకట్రెండు రోజులు తెలంగాణలోనే ఉండి ఇరువర్గాల నేతలను కలిసి సమస్యను సరిదిద్దేందుకు ఆయన ప్రయత్నం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొత్తకాకపోయినా.. తాజాగా నెలకొన్న విబేధాలు పార్టీకి నష్టం కల్గిస్తాయని అధిష్టానం ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ పగ్గాలు అప్పగించడమే చాలా మంది సీనియర్లకు కంటగింపుగా మారింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు బహిరంగంగానే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. బాధ్యతలు చేపట్టిన కొత్తలో రేవంత్ రెడ్డి పార్టీలోని సీనియర్ నేతలందరినీ కలిసి తనకు సహకరించాల్సిందిగా అభ్యర్థించారు.

అందరినీ కలుపుకుని వెళ్తానని, కలసికట్టుగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పనిచేద్దామని వారితో చెప్పారు. కొన్నాళ్లు బాగానే సాగినట్టుగా కనిపించినా.. వరుసగా వచ్చిన ఎన్నికలు, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లో ఓటమి, ఆ వెంటనే టీపీసీసీ కార్యవర్గం కూర్పు వంటి అంశాలు పార్టీ నేతల్లో నిట్టనిలువుగా చీలికను తీసుకొచ్చాయి. రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఏదో అద్భుతం జరుగుతుందని భావిస్తే డిపాజిట్లు కూడా దక్కించుకోలేని దుస్థితి తలెత్తిందని సీనియర్లు ఆరోపిస్తుండగా.. సీనియర్లే మోకాలడ్డుతూ, కుట్రలు చేస్తూ పార్టీ గెలవకుండా చేస్తున్నారని రేవంత్ వర్గం ప్రత్యారోపణలు చేస్తోంది. ఇదే సమయంలో పార్టీలోని సీనియర్లను బీఆర్ఎస్ కోవర్టులుగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం సాగగా, రేవంత్ వర్గాన్ని ‘ఎల్లో కాంగ్రెస్’గా అభివర్ణిస్తూ తాజాగా ప్రచారం మొదలైంది. ఇలా రెండు వర్గాలు పరస్పరం మీడియాలో, సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి దిగడంతో పార్టీ కార్యకర్తలు, శ్రేణుల్లో తీవ్ర అయోమయం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలు ఏ క్షణమైనా రావొచ్చని, వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధులై ఉండాల్సిన తరుణంలో ఈ కుమ్మలాటలు పార్టీకి నష్టం చేస్తాయని అధిష్టానం ఆందోళన చెందుతోంది. అందుకే తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టి దిగ్విజయ్ సింగ్‌ను రంగంలోకి దించింది. ఆయనకున్న అనుభవం, తెలంగాణ రాష్ట్ర పరిస్థితులపై ఉన్న అవగాహన పరిస్థితిని చక్కదిద్దేందుకు దోహదపడుతుందని అధిష్టానం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement