Tuesday, November 26, 2024

పంటపొలాల్లో వరద నీటిని తొలగించండి.. 40రోజులు దాటితే నాట్లు వేయొదు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు తెరిపినిచ్చిన నేపథ్యంలో రైతులు వెంటనే పంటల రక్షణకు సస్యరక్షణ చర్యలు మొదలుపెట్టాలని ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించింది. ఏయే పంటలలో ఏవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలని పంటల వారీగా వివరిస్తూ నివేదికను విడుదల చేసింది. 20 రోజలుగా రాష్ట్రంలో 567.7 మి.మీ ల వర్షం కురిసిందని, ఇది సాధారణ వర్షపాతం కన్నా 56శాతం ఎక్కువని తెలిపింది. భారీ వర్షాలు తెరిపినిచ్చిన నేపథ్యంలో అన్ని పంటల్లో లోతు కాలువల ద్వారా వరద నీటిని బయటకు పంపాలని, సాధ్యమైనం త త్వరగా కలుపు నివారణకు కృషి చేయాలని సూచించింది.

పంట విత్తి 20రోజులు దాటితే భాస్వర సంబంధిత ఎరువులను, కాంప్లెక్స్‌ ఎరువులను వాడొద్దని స్పష్టం చేసింది. వరదనీరు బయటకు వెళ్లిన తర్వాత సూచించిన మోతాదులో నత్రజని నేలపైన వేయకుండా మట్టిలో కలిసేట్టుగా వేయాలని సూచించింది. వరి నాట్లను స్వల్పకాలిక రకాలనే విత్తుకోవాలని సూచించింది. నాటు వేసే ముందు ఎకరాకు సరిపడే నారుమడిలో 800 గ్రా.ల గుళికలను చల్లాలని సూచించింది. వరి నారు 40రోజులు దాటిన తర్వాత నాటు వేస్తే ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పింది. స్వల్పకాలిక వరి రకాలను వ్యవసాయ అధికారులనుంచి తెలుసుకుని సాగు చేయాలని సూచించింది.

ఇక పత్తికి అదను దాటిపోయినందున సాగుచేయొద్దని సూచించింది. పత్తి ఆకులు అధిక వర్షాలకు ఎర్రబారినా జాజురోగంగా బావించి మెగ్నీషియం సల్ఫేట్‌ను పిచికారి చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. వేరుకుళ్లు తెగులు వ్యాపిస్తే ఆక్సిక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేయాలని సూచించింది. కలుపును నివారించేందుక ఎకరాకు 500మి.లీ. క్విజలోఫాస్‌ ఇథైల్‌ 4శాతాన్ని పిచికారి చేయాలని సూచించింది. మధ్యకాలిక, స్వల్పకాలిక మొక్కజొన్నను సాగు చేయొచ్చని వివరించింది. కంది, సోయా, పెసర, మినుము పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement