సీబీఎస్‌సీ సిలబస్‌లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం 10, 11,12 తరగతుల పాఠ్యాంశాల్లో అతి కీలకమైన ప్రజాస్వామ్యం-వైవిధ్యం, అలీనోద్యమం, ప్రచ్ఛన్నయుద్ధ శకం, ఆఫ్రో-ఆసియన్ ప్రాంతాల్లో ఇస్లామిక్ సామ్రాజ్యాల అవతరణ, పారిశ్రామిక విప్లవం వంటి పాఠ్యాంశాలను తొలగిస్తున్నట్లు సీబీఎస్‌సీ ప్రకటించింది. 2022-23 విద్యాసంవత్సరంలో ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. ప్రత్యేకించి చరిత్ర, రాజనీతిశాస్త్రం సిలబస్‌లోని కీలక చాప్టర్లను తొలగించింది. ఎన్‌సీఈఆర్‌టీ సిఫారసుల ప్రకారం హేతుబద్ధ విధానాల మేరకు పాఠ్యాంశాలను తగ్గించినట్లు సీబీఎస్‌సీ అధికారులు పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంగా భాసిల్లుతున్న భారత్‌లో ప్రజాస్వామ్యం-వైవిధ్యం పాఠ్యాంశాన్ని తొలగించడం గమనార్హం. అలాగే, పదో తరగతి సిలబస్‌నుంచి వ్యవసాయంపై ప్రపంచీకరణ ప్రభావం, ఆహారభద్రత, లౌకికవాదం, రాజకీయాలు,మతవాదం, లౌకికరాజ్యంవంటి అంశాలనూ ఈ ఏడాది మినహాయించారు.
11వ తరగతి చరిత్ర పుస్తకంలో తొలగించిన సెంట్రల్ ఇస్లామిక్ ల్యాండ్స్ కీలక అంశాలున్నాయి. ఆఫ్రో-ఆసియన్ ప్రాంతాల్లో ఇస్లామిక్ సామ్రాజ్యాల విస్తరణ, ఆర్థికరంగం, సమాజంపై వాటి ప్రభావం అనే పాఠ్యాంశాలున్నాయి. మొఘలుల కాలంలో కోర్టులు, మత, సాంస్కృతిక పునర్నిర్మాణంలో వాటి పాత్రకు సంబంధించిన పాఠ్యాంశాలు కూడా తొలగించినవాటిలో ఉన్నాయి. కోవిడ్ మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో గత ఏడాది రెండుసార్లు పరీక్షలు నిర్వహించగా ఈ ఏడాది ఆ విధానాన్ని రద్దు చేశారు. ఎప్పటిలా ఏడాదికి ఒకేసారి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నామని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని సీబీఎస్‌సీ నిర్ణయించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..