Tuesday, November 19, 2024

Rajasthan: మ‌త ఆధారిత రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేస్తాం… ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో మోదీ

ఎస్సీ ,ఎస్టీ, బిసి కోటాలో కోత‌తో
ముస్లీంల‌కు రిజ‌ర్వేష‌న్ లు ఇచ్చిన కాంగ్రెస్
ఇది అంబేద్క‌ర్ స్ఫూర్తికి విరుద్ద‌మ‌న్న ప్ర‌ధాని

రాజ‌స్థాన్ – కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితులు, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను విచ్ఛిన్నం చేసి ముస్లింల‌కు ప్రత్యేక రిజర్వేషన్లు ఇచ్చింద‌ని ప్ర‌ధాని మోదీ మండిప‌డ్డారు.. ఈ చ‌ర్య రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకమ‌న్నారు. రాజస్థాన్‌లోని టోంక్- సవాయి మాధోపూర్‌లో నేడు జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులకు బాబా సాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ హక్కును మత ప్రాతిపదికన ముస్లింలకు ఇవ్వాలని ఇండియా కూటమి కోర‌డం ఓటు బ్యాంక్ రాజ‌కీయ‌మేన‌ని మండిప‌డ్డారు.. దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులకు రిజర్వేషన్లు రద్దు చేయడం గానీ, మతం ఆధారంగా విభజించడం గానీ కుదరదని మోదీ తెలిపారు. తాము మరోసారి అధికారంలోకి వ‌స్తే మ‌త ప్ర‌తిపాదిక రిజ‌ర్వేష‌న్ల‌ను పూర్తిగా ర‌ద్దు చేస్తామ‌ని తేల్చి చెప్పారు.

జ‌మ్మూలో కాంగ్రెస్ లో అధికారంలో ఉంటే నిత్యం మార‌ణ‌హోమ‌మే …
జ‌మ్మూ అండ్ కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే.. నేటికీ అక్కడ జవాన్లపై రాళ్లు, బాంబు దాడులు కొనసాగుతూనే ఉండేవ‌న్నారు. ప్రజలు మెచ్చిన బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ప్రస్తుతం అక్కడ ప్రశాంత వాతావరణం తీసుకొచ్చిందని మోదీ తెలిపారు. ఇక, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మన సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు జరిగేది కాదని నరేంద్ర మోడీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే దేశంలో ఎక్కడో ఒక చోట బాంబు పేలుళ్లు జరిగేవన్నారు. రాజస్థాన్ లో వరుస పేలుళ్ల నిందితులను కాంగ్రెస్ కాపాడి పాపానికి పాల్పడిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే అవినీతికి కొత్త మార్గాలను అన్వేషిస్తుంద‌న్నారు.. కాంగ్రెస్ హయాంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలు రాజస్థాన్ నెంబర్-1 స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు. అలాగే, తనకు దేశ ప్రజలందరి ప్రేమ, ఆశీస్సులు, ఉత్సాహం లభించాయని చెప్పారు. ఈ రోజు హనుమాన్ జయంతి శుభ సందర్భంగా.. ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement