న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: నిజాం నిరంకుశ విధానాలకు, జాగీర్దార్లు, జమీందార్లకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి భారతీయ జనతా పార్టీ మతం రంగు పులుముతోందని భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం హిందూ-ముస్లిం అంశం కాదని అన్నారు. నిజాం పాలనలో రాజు మాత్రమే ముస్లిం అని, ఆయన దగ్గర పనిచేసినవారిలో చాలామంది హిందువులేనని ఆయన స్పష్టం చేశారు.
జాగీర్దార్లు, జమీన్‌దార్లకు వ్యతిరేకంగా జరిగిన ఈ పోరాటంలో ముస్లింలు కూడా పాల్గొన్నారని తెలిపారు. నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా రచనలు చేసినందుకు షోయబుల్లా ఖాన్ చేతులను నరికేశారని వీరభద్రం గుర్తుచేశారు. తెలంగాణ విమోచన దినం పేరుతో ముస్లిం రాజుపై హిందూ ప్రజలు చేసిన తిరుగుబాటుగా బీజేపీ చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను సీపీఐ(ఎం) నిర్వహిస్తుందని ప్రకటించారు.
మరోవైపు మునుగోడు ఉప-ఎన్నికలను బీజేపీ సృష్టించిందని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా బీజేపీ మాత్రమే ఉందని చెప్పడానికి ఈ ఎన్నికలు తీసుకొచ్చారని మండిపడ్డారు. కమ్యూనిస్టులకు మునుగోడులో గట్టి ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ.. ఎన్నికల్లో పోటీ చేస్తే బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోయి ఆ పార్టీ లాభపడుతుందని, అందుకే బీజేపీ వంటి మతతత్వ శక్తులను ఓడించడం కోసమే సీపీఐ(ఎం) టీఆర్ఎస్ పార్టీకి మద్ధతు ప్రకటించిందని పునరుద్ఘాటించారు. ఈ మద్ధతు కేవలం ఈ ఎన్నికల వరకే పరిమితమని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.
జాతీయ రాజకీయ పార్టీని పెట్టి లౌకిక శక్తులతో కలిసి ముందుకెళ్తానని కేసీఆర్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని, అయితే ఆ సమయం వచ్చినప్పుడు తదుపరి పొత్తులు, కూటములపై చర్చ జరుగుతుందని అన్నారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి కాంగ్రెస్‌ను బలహీనపరిచారని, అక్కడ టీఆర్ఎస్-బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొన్న పరిస్థితులున్నాయని తమ పార్టీ పరిశీలనలో కూడా తేలిందని అన్నారు. అందుకే టీఆర్ఎస్‌కు మద్ధతు ప్రకటించామని, దానర్థం తమకు కాంగ్రెస్ అంటే వ్యతిరేకత, టీఆర్ఎస్ అంటే ప్రేమ ఉన్నట్టు కాదని వెల్లడించారు. దేశంలో చాలా చోట్ల బీజేపీని ఓడించడం కోసం కాంగ్రెస్‌కు మద్ధతిచ్చిన ఉదంతాలను మర్చిపోవద్దని తెలిపారు.
కొత్త పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలన్న ప్రతిపాదనను సీపీఐ(ఎం) తరఫున తాము స్వాగతిస్తున్నామని తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. అంబేద్కర్ కులరహిత సమాజం కోసం పాటుపడిన మహనీయుడని ఈ సందర్భంగా ఆయన కీర్తించారు. ఖమ్మం జిల్లాలో తనపై వచ్చిన హత్యారోపణలను వీరభద్రం ఖండించారు. హత్యారోపణలు ఎవరో రాజకీయ నేతలు చేసినవి కావని, ఒక కుటుంబం మాత్రమే ఈ ఆరోపణలు చేసిందని వ్యాఖ్యానించారు. అవి కూడా పోలీసుల విచారణలో తప్పని తేలిందని, ప్రస్తుతం కేసు కోర్టులో విచారణ దశలో ఉందని తెలిపారు.