Saturday, November 23, 2024

కాళేశ్వరంపై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట.. 3వ టీఎంసీ స్టేటస్ కో ఉత్తర్వుల్లో సవరణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 3వ టీఎంసీ పనుల విషయంలో ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 3వ టీఎంసీ పనులపై గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వుల్లో ధర్మాసనం సవరణలు చేసింది. స్టేటస్ కో ఉత్తర్వుల్లో సవరణ కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. మూడో టీఎంసీ కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతుల కోరుతూ దాఖలు చేసిన విజ్ణప్తులను పరిశీలించవచ్చంటూ గోదావరి బోర్డు, సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యుసీ)కి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఈ వెసులుబాటు కూడా తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. అదే సమయంలో ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం తీసుకొని భూములు ఇవ్వదలచుకున్న రైతులకు కూడా అనుమతి మంజూరు చేసింది.

కాళేశ్వరం ప్రాజెక్టు 3వ టీఎంసీ పనుల విషయంలో ముంపునకు గురవుతున్న ప్రాంతాల రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కోసం భూములివ్వడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లకు జతగా చెరకు శ్రీనివాస రెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్లో 3వ టీఎంసీ పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ, గోదావరి బోర్డుల నుంచి అనుమతి లేదని తెలిపారు. పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం 3వ టీఎంసీ పనులపై స్టేటస్ కో ఉత్తర్వులిచ్చింది.

అయితే ఈ స్టేటస్ కో ఉత్తర్వుల కారణంగా పర్యావరణ అనుమతులు ఆలస్యమవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. తాము సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటామని, అప్పటి వరకు స్టేటస్ కో తొలగించాలని కోరింది. తుది తీర్పు వచ్చేలోగా అనుమతులపై గోదావరి బోర్డు, సీడబ్ల్యుసీ నిర్ణయం తీసుకునేలా స్టేటస్ కో ఉత్తర్వుల్లో సవరణ చేయాలని కోరడంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ మేరకు ఉత్తర్వుల్లో మార్పులు చేసింది. రాజకీయ పరమైన కారణాలతోనే కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు అడ్డుపడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ ఆరోపించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement