Wednesday, November 20, 2024

Delhi | వనమాకు సుప్రీంలో ఊరట.. హైకోర్టు తీర్పుపై ‘స్టే’

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అనర్హత వేటుకు గురైన కొత్తగూడెం శాసన సభ్యులు వనమా వెంకటేశ్వర రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. హైకోర్టు తీర్పుపై ‘స్టే’ విధించిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేయాలని, తదుపరి విచారణ 4 వారాల అనంతరం చేపడతామని వెల్లడించింది. వనమా దాఖలు చేసిన కేసును జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ జరిపి, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వనమా వెంకటేశ్వర రావు, బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావుపై 4వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే ఎన్నికల అఫిడవిట్‌లో వనమా తన ఆస్తులు, కేసుల వివరాలను పొందుపర్చలేదని, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ జలగం వెంకటరావు హైకోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

ఈ పిటిషన్‌పై సుదీర్ఘంగా సాగిన విచారణ అనంతరం జులై 25న తీర్పునిస్తూ వనమా వెంకటేశ్వర రావును తెలంగాణ హైకోర్టు అనర్హుడిగా ప్రకటించింది. ఎన్నికల ఫలితాల్లో రెండో స్థానంలో ఉన్న జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ.. 2018 డిసెంబర్ 12 నుంచి ఆయన్ను ఎమ్మెల్యేగా పరిగణించాలంటూ తీర్పు వెలువరించింది. తీర్పు కాపీని జులై 26న అసెంబ్లీ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి జలగం అందజేశారు. అయితే ఈ తీర్పుపై ‘స్టే’ కోరుతూ వనమా తొలుత హైకోర్టునే ఆశ్రయించారు. హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో.. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సోమవారం జరిగిన విచారణలో వనమా వెంకటేశ్వర రావు తరఫున వాదనలు వినిపిస్తూ మణిపూర్ ఉదంతాన్ని న్యాయవాది ఉదహరించారు. ఆ రాష్ట్రంలో ఇలాగే ఒక ఎమ్మెల్యే అనర్హత వేటుకు గురైన సందర్భంలో రెండో స్థానంలో ఉన్న అభ్యర్థికి పదవి వర్తిస్తుందని తొలుత చెప్పారని, కానీ అప్పటికే అతను పార్టీ మారిన నేపథ్యంలో రాజ్యంగంలోని 10వ షెడ్యూల్ అమల్లోకి వస్తుందని భావించి ఆ తీర్పును మార్చారని గుర్తుచేశారు.

వనమా విషయంలోనూ ఇదే జరిగిందని న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి వనమా వెంకటేశ్వర రావు గెలిచారని, కానీ ఇప్పుడు ఆయన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో ఉన్నారని తెలిపారు. హైకోర్టు తీర్పు ద్వారా జలగం వెంకటరావుకు ఎమ్మెల్యే పదవి ఇచ్చినప్పటికీ.. ఆయన కూడా బీఆర్ఎస్‌లోనే ఉన్నారని, ఈ పరిస్థితుల్లో రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రస్తావన ఉంటుందని న్యాయవాది తెలిపారు.

స్వల్ప వాదనల అనంతరం ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి 2 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. అప్పటి వరకు హైకోర్టు తీర్పుపై ‘స్టే’ అమల్లో ఉంటుందని వెల్లడించింది. హైకోర్టు తీర్పు ద్వారా అనర్హత వేటుకు గురైన వనమా వెంకటేశ్వర రావు సుప్రీంకోర్టు కోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరవడానికి ఆస్కారం ఏర్పడింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement