బెంగళూరు : లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యోడ్యూరప్పకు ఊరట లభించింది. ఆయనును ఈ నెల 17 వరకు అరెస్ట్ చేయవద్దని కర్ణాటక హైకోర్టు పోలీసులకు ఆదేశించింది. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ యెడ్యూరప్పపై కర్ణాటక సీఐడీ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
వీరి ఎఫ్ఐఆర్ మేరకు సెషన్స్ కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ఈ నెల 17 న సీఐడీ విచారణకు హాజరవుతానని ఇదివరకే పోలీసులకు యెడ్యూరప్ప సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
ఈ నెల 17 న విచారణకు హాజరవుతున్నందున అప్పటి వరకు తన క్లయింట్‌ను అరెస్ట్ చేయకుండా ఉండాలని యెడ్యూరప్ప తరపు న్యాయవాది వాదించారు. దీనికి అంగీకరించిన హైకోర్టు.. యెడ్యూరప్పను ఈ నెల 17 వరకు అరెస్ట్ చేయకూడదని ఆదేశించింది. ప్రస్తుతం యెడ్డీ ఢిల్లిలో ఉన్నారు. సహాయం కోసం ఆయన నివాసానికి వెళ్లిన తన కుమార్తెపై యెడ్యూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.