Saturday, November 23, 2024

పరిశ్రమలకు ఊరట.! విద్యుత్‌ పునరుద్ధరణకు కనిష్ట చార్జీలే..

అమరావతి, ఆంధ్రప్రభ: పరిశ్రమల నిర్వాహకులకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఊరట కలిగించింది. రాష్ట్రంలో నిర్వహణ భారమై మూతపడ్డ పరిశ్రమలకు విద్యుత్‌ సర్వీసును తిరిగి ఇచ్చేందుకు కనిష్ట చార్జీలను వసూలు చేయాలని విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లను ఆదేశించింది. ఈ నిబంధన వచ్చే మార్చి 31 వరకు అమలులో ఉంటుందంది. ఖాయిలా పడ్డ పరిశ్రమలకు విద్యుత్‌ పునరుద్ధరణ విధానం అమలుపై మూడు నెలలకోసారి సమాచారం ఇవ్వాలని నిర్దేశించింది. ఓ పరిశ్రమ విద్యుత్‌ బిల్లులు చెల్లించకుండా కొంతకాలం నడిచి, మూతపడితే మూడు నెలల పాటు కనీస చార్జీల రూపంలో బిల్లు జారీ అవుతుంది. తరువాత ఆ బిల్లూ నిలిపేస్తారు. కొన్నేళ్ల తరువాత పరిస్థితులు చక్కబడి పరిశ్రమను తిరిగి తెరవాలనుకున్నప్పుడు విద్యుత్‌ సర్వీసును పునరుద్ధరించాల్సి ఉంటుంది.

అప్పుడు మూతపడ్డ రోజులన్నిటికీ కనీస చార్జీలు వసూలు చేయాల్సి ఉన్నా అలా చేయరు. తొలి మూడునెలలకు మాత్రమే కట్టించుకుని మళ్లీ సర్వీసును ఇచ్చేస్తారు. అయితే పరిశ్రమ మూతపడే సమయానికి ఉన్న విద్యుత్‌ బిల్లు బకాయిలను మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. కోవిడ్‌ 19 కారణంగా దెబ్బతిన్న పరిశ్రమలు వైరస్‌ ప్రభావం తగ్గడంతో మళ్లీ తెరుచుకుంటున్నాయి. అటువంటి పరిశ్రమలకు ఏపీఈఆర్‌సీ ద్వారా డిస్కంలు అందిస్తున్న ఈ వెసులుబాటు ప్రయోజనం కలిగించనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement