హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : పదవ తరగతి హిందీ పరీక్ష పేపర్ లీకేజీకి కారణమయ్యాడన్న ఆరోపణలతో డిబార్ అయిన విద్యార్థి హరీష్‌కు ఊరట లభించింది. సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు రాసేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో హిందీ పేపర్ లీకేజీ ఆరోపణలతో అధికారులు హరీష్‌ను డిబార్ చేసిన విషయం తెలిసిందే. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తరపున విద్యార్థి తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
తన కొడుకు హరీష్ హిందీ పరీక్ష రాస్తున్న సమయంలో ఎవరో బలవంతంగా పేపర్ లాక్కున్నారని తెలిపారు. కమలాపూర్‌లో నమోదైన ఎఫ్ఐఆర్లో కూడా హరీష్ పేరు ఎక్కడా లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయినా అధికారులు శుక్రవారం నాటి పరీక్షను రాసేందుకు అనుమంతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకును రాజకీయాలకు బలిచేశారని ఆరోపిస్తూ.. హరీష్‌ను -టె-న్త్ పరీక్షలు రాసేలా అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిపై శనివారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. విద్యార్థిని మిగతా పరీక్షలు రాసేలా అనుమతివ్వాలని అధికారులను ఆదేశించింది.