కన్జ్యూమర్ మార్కెట్లో వేగంగా అగ్రస్థానానికి చేరేందుకు రిలయన్స్ ధరల యుద్ధానికి తెరలేపింది. అమెరికాకు చెందిన కోలాలను ఎదుర్కొనేందుకు కాంపా డ్రింక్‌ను మార్కెట్లో లాంచ్ చేసిన రిలయన్స్, ఇక అన్ని రకాల ఎఫ్ఎంసీజీ గూడ్స్‌ను విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సోడా నుంచి పోప్‌ల వరకు ప్రస్తుతం మార్కెట్లో లభించే ధరల్లో 30 నుంచి 35 శాతం తక్కువ ధరలకే వీటిని వినియోగదారులకు అందించాలని నిర్ణయించింది. సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు ఉన్న పెప్పీకో, కోకాకోలాను ధీటుగా ఎదుర్కోనేందుకు రిలయన్స్ కాంపా డ్రింక్ ధరలను బాగా తగ్గించింది. 200 ఎంఎల్ బాటిల్‌ను 10 రూపాయలకు, 500 ఎంఎల్ బాటిల్‌ను 20 రూపాయలకే అందిస్తోంది.
మార్కెట్లో ఇప్పటికే బాగా పేరున్న బ్రాండ్ల కంటే తక్కువ ధరలకు అంతకంటే మంచి నాణ్యతతో, పనితీరు మెరుగ్గా ఉండేలా పోటీతత్వంతో కూడిన ధరలను వినియోగదారులకు ఇవ్వాలని రిలయన్స్ నిర్ణయించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మార్కెట్లో లభించే పేరున్న బ్రాండ్స్ కంటే కనీసం 30 నుంచి 35 శాతం తక్కువ ధరలకే వీటిని కస్టమర్లకు అందించనుంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్)కు చెందిన రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్సీపీఎల్)ఈ ఉత్పత్తులను ఎంపిక చేసిన మార్కెట్లలో మాత్రమే విక్రయించనుంది. అయితే దేశవ్యాప్తంగా బలమైన డీలర్ నెట్‌వర్క్‌ను మాత్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నెమ్మదిగా ఆధునిక మార్కెట్లు (ఆన్లైన్)తో పాటు జనరల్ ట్రేడ్ విధానంలోనూ వీటిని విక్రయించనున్నారు.
రిలయన్స్‌కే ప్రత్యేకమైన పంపిణీ వ్యవస్థను, డీలర్ నెట్‌వర్క్‌ను, స్టాకిస్టులను నియమించనుంది. బిజినెస్ 2 బిజినెస్ ఛానల్స్‌ను బలోపేతం చేయనుంది. మన దేశంలో 110 బిలియన్ డాలర్ల ఎఫ్ఎంసీజీ మార్కెట్లో ప్రధాన ప్లేయర్‌గా ఉండాలని రిలయన్స్ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ మార్కెట్లో హిందూస్థాన్ యూనిలీవర్, పీ అండ్ జీ, రాకిట్, నెస్లే కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. రిలయన్స్ బ్యూటీ సోప్‌లను, రియల్ నేచురల్ సోప్స్‌ను, హైజనిక్ పోప్లను 25 రూపాయలకు అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో లీడింగ్ కంపెనీల సోప్‌ల ధరలు ఇంతకంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. లక్స్ వంద గ్రాముల సోప్ ధర 35 రూపాయలు, డెటాల్ సోప్ 75 గ్రాముల ధర 40 రూపాయలు, సంతూర్ 100 గ్రాముల ధర 34 రూపాయలు ఉన్నాయి. మార్కెట్లో సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ 2 లీటర్ల ప్యాక్ ధర 325 రూపాయలుగా ఉంటే, అదే రిలయన్స్‌కు చెందిన ఇంజో 2 లీటర్ల ప్యాక్ ధర 250 రూపాయలుగా ఉంది. ప్రస్తుతం వీటిని జియో మార్ట్ ద్వారా వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. ఇదే ఇంజో డిటర్జెంట్ పౌడర్ ఒక కిలో ధర 149 రూపాయలకే ఇస్తోంది.
పౌండర్, లిక్విడ్‌లో ఫంట్, టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్‌కు ఒకే ధరను రిలయన్స్ ఆఫర్ చేస్తోంది. డిష్ వాష్ సిగ్మెంగ్లోనూ రిలయన్స్ తక్కువ ధరలకే బార్స్‌ను లిక్విడ్ జల్‌ను అందిస్తోంది. బార్స్‌ను 5,10,15 రూపాయల ధరల్లోనూ, లిక్విడ్ జెల్‌ను 10, 30, 45 రూపాయల ధరల్లో అందిస్తోంది. మన దేశ సాఫ్ట్ డ్రింక్ మార్కెట్ ఒక అంచనా ప్రకారం 8.85 బిలియన్ డాలర్లు. ఈ మార్కెట్లో పోటీలో నిలబడేందుకు రిలయన్స్ తన కాంపా డ్రింక్ ధరలు భారీగా తగ్గించింది. రిలయన్స్ అన్ని రిటైల్ స్టోర్స్‌లో విక్రయానికి పెట్టింది. త్వరలోనే దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ డ్రింక్‌ను రిలయన్స్ ప్రమోట్ చేయనుంది. టెలికం రంగంలో ధరల యుద్ధానికి తెరలేపి అతి తక్కువ కాలంలో మార్కెట్ లీడర్‌గా రిలయలన్స్ జియో నిలబడేలా చేసింది. ఇదే వ్యూహాన్ని అమలు చేసి ఎఫ్ఎంసీజీ మార్కెట్లోనూ అగ్రస్థానానికి చేరాలని రిలయన్స్ ప్లాన్ చేస్తోంది. మన దేశ బ్యూటీ, అండర్ పర్సనల్ కేర్ ఉత్పత్తుల మార్కెట్ 2022లో 21.65 బిలియన్ డాలర్లుగా ఉంది.
అందుకే ఈ రంగంలో భారీగా ధరల యుద్ధానికి రిలయన్స్ తెరలేపింది. ప్రధానంగా మార్కెట్ లీడర్‌గా హిందూస్థాన్ యూనిలీవర్ ఉత్పత్తులు కంటే నాణ్యతలో మిన్నగా ఉంటేనే వినియోగదారులు వీటిని ఆదరిస్తారని మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎఫ్ఎంసీజీ మార్కెట్లో ఉత్పత్తులు మోడ్రన్ ట్రేడ్‌లో 8-10 శాతం అమ్మకాలు జరుగుతున్నాయి. 85-87 శాతం అమ్మకాలు జనరల్ ట్రేడ్‌లో జరుగుతున్నాయి. చిన్నచిన్న షాప్స్ దేశంలో 11 నుంచి 13 మిలియన్లు ఉంటాయని అంచనా. రిలయన్స్ ఈ మార్కెట్‌పై ప్ర్ధానంగా దృష్టి కేంద్రీకరిస్తోంది. పెద్ద పెద్ద నగరాల్లో రిలయన్స్ స్టోర్స్, ఇతర మాల్స్ వంటి మార్కెట్లకు ప్రాధాన్యత ఇస్తూనే, చిన్న చిన్న మార్కెట్లలోకి ప్రవేశించాలని భావిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సోప్స్ విషయంలో మన దేశంలో ప్రధాన బ్రాండ్లతో పాటు వెయ్యికి పైగా రకరకాల బ్రాండ్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ విషయంలో రిలయన్స్ భారీ స్థాయిలో ప్రకటనలు ఇవ్వడంతోపాటు, వాటిని వినియోగదారులకు అందుబాటులో తీసుకురావాల్సిఉంటుంది. అప్పుడే అవి వినియోగదారులకు చేరుతాయని మార్కెట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.