రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పోతున్నారు. భారత్‌లో అపర కుబేరుడిగానే కాదు.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో చేరారు. తాజాగా మరో ప్రముఖ కంపెనీలో రియలన్స్ సంస్థ పెట్టుబడులు పెట్టింది. ప్రముఖ ప్రీమియం లో దుస్తుల రిటైల్ సంస్థ క్లోవియాకు చెందిన మెజార్టీ వాటాలను రిలయన్స్ సంస్థ కొనుగోలు చేసింది. క్లోవియా మాతృ సంస్థ పర్పుల్ పాండ్ ఫ్యాషన్స్‌లో 89 శాతం ఈక్విటీ వాటాలను రిలయన్స్ సంస్థ రూ.950 కోట్లకు దక్కించుకుంది. ఇక మిగిలిన వాటాలు కంపెనీ వ్యవస్థాపక సభ్యులు, మేనేజ్‌మెంట్ దగ్గర ఉన్నాయి. 2013లో పంకజ్ వర్మనీ, నేహా కాంత్, సుమన్ చౌదరీలు కలిసి సంయుక్తంగా ఈ కంపెనీని ప్రారంభించారు. క్లోవియా మహిళల కోసం ఇన్నర్‌వేర్, లాంజ్‌వేర్‌లను ఉత్తమ క్వాలిటీతో అందిస్తోంది.
కస్టమర్స్‌ను ఆకట్టుకునేలా ఫ్రెష్ స్టెల్స్‌తో సరసమైన ధరలకు అందిస్తూ.. ప్రసిద్ధి చెందింది. క్లోవియాలో 3,500కు పైగా ఉత్పత్తి శైలులు ఉన్నాయని ఆర్‌ఆర్‌వీఎల్ తెలిపింది. కాగా తాజా పరిణామాలపై క్లోవియా, రిలయన్స్ ఇరు సంస్థలు స్పందిస్తూ.. సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. వినియోగదారులకు అత్యుత్తమ ఉత్పత్తులు అందించడమే తమ లక్ష్యం అని, అందుకే క్లోవియా బ్రాండ్‌ను కూడా తమ పోర్ట్ ఫోలియోలో చేర్చామని ఆర్‌ఆర్‌వీఎల్ డైరెక్టర్ ఈషా అంబానీ వెల్లడించారు. ఇప్పటికే జివామో, అమాంటే బ్రాండ్లను దక్కించుకున్న ఆర్‌ఆర్‌వీఎల్‌కు తాజాగా క్లోవియా కొనుగోలుతో ఇన్నర్ వేర్ సెగ్మెంట్‌లో మరింత విస్తరించినట్టు అయ్యింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..