ఫ్యూచర్ గ్రూప్‌తో ఒప్పందం విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ శనివారం కీలక ప్రకటన చేసింది. కిశోర్ బియానీ నేతృత్వం వహిస్తున్న ఫ్యూచర్ గ్రూప్‌తో విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు వివరించింది. ఈ డీల్ విలువ రూ.24,713 కోట్లుగా తెలిపింది. ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్‌ఆర్‌ఎల్) ఆస్తులను రిలయన్స్ రిటైల్‌కు విక్రయించేందుకు ప్రతిపాదించిన లావాదేవీని సెక్యూర్డ్ రుణదాతలు (ఆస్తులను తనఖా ఉంచుకుని రుణాలు ఇచ్చినవారు) తిరస్కరించడంతోనే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు రిల్ సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా సెక్యూర్డ్ రుణదాతలు ఒటేశారని చెప్పుకొచ్చింది. ఈ కారణంగానే.. డీల్‌ను విషయంలో వెనకడుగు వేసినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. బియానీ నేతృత్వంలో గతంలో చేసుకున్న ఒప్పందాన్ని ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ గుర్తు చేసింది. 2020, ఆగస్టులోనే ఈ డీల్ కుదిరిందన్న రిలయన్స్ తెలిపింది. ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించామని వివరించింది.
డీల్ వ్యతిరేకంగా ఓటింగ్..
ఫ్యూచర్ గ్రూప్ రుణ దాతల ఓటింగ్‌పై మాట్లాడుతూ.. ఎఫ్‌ఆర్‌ఎల్, ఇతర లిస్టెడ్ కంపెనీలతో కూడిన ఫ్యూచర్ గ్రూప్.. ఓటింగ్ ఫలితాన్ని తమకు తెలియజేసిందని, మీటింగ్‌లో పాల్గొన్న షేర్ హోల్డర్లు, క్రెడిటర్లు డీల్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారని రిలయన్స్ వివరించింది. డీల్‌లో పేర్కొన్న అంశాలు ఆచరణ సాధ్యం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేర్కొంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌కు తమ ఆస్తులను రూ.24,713 కోట్లకు విక్రయించేందుకు వారు అనుమతించేది లేదని ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ తమకు ఫ్యూచర్ లిమిటెడ్ తెలియజేసిందని వివరించింది. వారంతా ఓటింగ్ రూపంలో తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్టు రిల్ పేర్కొంది. ఫ్యూచర్ గ్రూపులో రిటైల్, హోల్‌సేల్ బిజినెస్, రవాణా (లాజిస్టిక్స్), గిడ్డంగుల నిర్వహణ వ్యాపారాలను రిల్ అనుబంధ విభాగాలు అయిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌వీఎల్), రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టయిల్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌ఎఫ్‌ఎల్‌ఎల్) ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒప్పందాన్ని అమలు చేయడం కుదరదని రిలయన్స్ స్పష్టం చేసింది.
19 కంపెనీలతో రిల్ ఒప్పందం..
రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ రంగాలకు చెందిన మొత్తం 19 ఫ్యూచర్ గ్రూప్ కంపెనీలను రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకున్నామని రిల్ గతంలో ప్రకటించింది. రిల్ గ్రూప్‌లకు సంబంధించిన అన్ని రిటౖౖెల్ కంపెనీల హోల్డింగ్ కంపెనీయే ఆర్‌ఆర్‌వీఎల్. ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ డీల్‌పై ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్‌లో షేర్ హోల్డర్స్,అన్ సెక్యూర్ రుణదాతల్లో 75 శాతం ఆమోదించారు. 69.29 శాతం మెజార్టీ సెక్యూర్డ్ రుణదాతలు తిరస్కరించారు. ఈ లావాదేవీ పూర్తి కావడానికి 75 శాతం సెక్యూర్డ్ రుణదాతలు అనుమతించాల్సి ఉంటుంది. డీల్‌కు 85.94 శాతం మంది షేర్ హోల్డర్లు ఆమోదం తెలిపారు. ఈ ఒప్పందంపై ఇప్పటికే ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఆరంభం నుంచే వ్యతిరేకిస్తూ వస్తున్నది. తమ కంపెనీతో గతంలో ప్యూచర్ గ్రూప్ చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అమెజాన్ ఆరోపిస్తూ వస్తున్నది. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా సింగపూర్ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను కూడా ఆశ్రయించింది. ఈ క్రమంలో ఫ్యూచర్ గ్రూప్, అమెజాన్ భారత్‌లో పలు న్యాయ స్థానాలను కూడా ఆశ్రయించాయి. ఓ దశలో ఈ డీల్‌ను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. ఇలా వివాదం ఎక్కడా పరిష్కారం కాకపోవడంతో.. సుప్రీం సూచన మేరకు తిరిగి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌లోనే తేల్చుకునేందుకు ఇటీవల ఇరు వర్గాలు అంగీకరించాయి. ఇంతలోనే ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు రిలయన్స్ ప్రకటించడం విశేషం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..