హైదరాబాద్, ఆంధ్రప్రభ : యూఏఈలో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణకు చెందిన ఐదుగురు ప్రవాస భారతీయులను వెంటనే విడుదల చేయాలని ఆ దేశ ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలి ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు వివరాలను అందజేశారు. శివరాత్రి మల్లేష్, శివరాత్రి రవి, నాంపల్లి వెంకట్, దండుగుల లక్ష్మణ్, శివరాత్రి హనుమంతులు ప్రస్తుతం ఒక కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్నారు. 2005లో నేపాల్ దేశానికి చెందిన దిల్ ప్రసాద్ రాయ్ మరణం విషయంలో వీరంతా నిందితులుగా ఉన్నారు. అయితే యూఏఈ షరియా చట్టాల ప్రకారం 15 లక్షల రూపాయలను బాధితుని కుటుంబం స్వీకరించేందుకు అంగీకరించిందని మంత్రి కేటీఆర్ ఈ సమావేశంలో గుర్తు చేశారు.
2013లో స్వయంగా తానే నేపాల్ వెళ్లి బాధితుని కుటుంబాన్ని కలిసినట్లు తెలిపారు. షరియా చట్టం ప్రకారం బాధితుల కుటుంబం క్షమాపణ పత్రం అందిస్తే వీరిని విడుదల చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. 2013లోనే బాధితుని కుటుంబం ఇందుకు అవసరమైన అన్ని రకాల పత్రాలను దుబాయ్ ప్రభుత్వానికి అందజేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ విషయంపై భారత దౌత్య కార్యాలయానికి, యూఏఈ దౌత్య కార్యాలయానికి పలు సార్లు స్వయంగా విజ్ఞప్తి చేశానన్నారు. అయితే యూఏఈ కోర్టు వీరి క్షమాబిక్ష పిటిషన్‌ను తిరస్కరించిందన్నారు. ఇప్పుడు దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ క్షమాబిక్ష పెడితేనే బాధితులకు విముక్తి లభిస్తుందని తెలిపారు. దుబాయ్ రాజు ఈ విషయంలో సానుకూలంగా స్పందించేలా ఆయన దృష్టికి తమ విజ్ఞప్తిని తీసుకు వెళ్లాలని మంత్రి కేటీఆర్ యూఏఈ రాయబారిని కోరారు.
తెలంగాణ పై యూఏఈ రాయబారి ప్రశంసలు..
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలి ప్రసంశలు కురిపించారు. అంతర్జాతీయ స్థాయిలో మౌళిక వసతులు ఉన్నాయన్నారు. భవిష్యత్‌లో భాగ్యనగరం రూపు రేఖలే మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. స్టార్టప్ ఈకో సిస్టం, ఐటీతో పాటు ఐటీ అనుబంధ రంగాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడి అంశాలను, ప్రభుత్వ పాలసీలను మంత్రి కేటీఆర్ రాయబారికి వివరించారు. స్టార్టప్ ఈకో సిస్టంతో ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లోని వెంచర్ క్యాపిటలిస్టులు, ఇన్నోవేషన్ ఈకో సిస్టం భాగస్వాములు కలిసి పని చేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. ఇదే విధంగా యూఏఈలోని వెంచర్ క్యాపిటలిస్టులను టీ హబ్‌కు పరిచయం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మంత్రి విజ్ఞప్తిపై యూఏఈ రాయబారి సానుకూలంగా స్పందించారు. తమ దేశంలోని వెంచర్ క్యాపిటలిస్టులను హైదరాబాద్ ఈకో సిస్టంలోని స్టార్టప్ సంస్థలకు అనుసంధానం చేసేలా ప్రయత్నం చేస్తానంటూ హామీని ఇచ్చారు.