Friday, November 15, 2024

15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయండి.. కేంద్ర మంత్రిని కోరిన ఏపీ సర్పంచులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయితీలకు విడుదల చేయాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్‌తో పాటు ఆ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ సర్పంచులు కోరారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సోమవారం జరిగిన జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిలకలపూడి పాపారావు మరికొందరు సర్పంచులతో కలిసి కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ భవన్లో  జరిగిన విలేకరుల సమావేశంలో సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిలకలపూడి పాపారావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆంధ్రప్రదేశ్ కు ఒక్క అవార్డు కూడా రాకపోవడం బాధాకరమని, ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రే కారణమని నిందించారు.

స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి పునరాలోచన చేసి రాష్ట్రానికి రావలసిన 15వ ఆర్థిక సంఘం నిధులను ,రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను నేరుగా కోతలు లేకుండా గ్రామ పంచాయతీలకు ఇవ్వాలని అన్నారు. కేంద్రం నుంచి రూ. 2,010 కోట్లు రావాల్సి ఉందని, తక్షణమే వాటిని విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్టు చెప్పారు. నిధులు విడుదల చేయకపోతే జిల్లా, రాష్ట్రస్థాయిలో పార్టీలకతీతంగా సర్పంచులు అందరిని సంఘటితం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. పీఎఫ్ఎంఎస్‌ను గ్రామపంచాయితీలకు అనుసంధానం చేయలేదని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 5వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్లనే కేంద్రం నిధులు విడుదల చేయడం లేదని పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్ చెప్పారని పాపారావు అన్నారు.

- Advertisement -

అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం నెట్టేసుకుంటూ కాలయాపన చేస్తే ఏపీలోని గ్రామ పంచాయతీలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం 29 అంశాలను రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామపంచాయతీలకు ఇప్పటి దాకా కూడా బదిలీ చేయకపోవడం దారుణమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా పీఎఫ్ఎంఎస్ ఖాతాల్లోకి నిధులను వేసే విధంగా రాష్ట్ర ఎంపీలంతా కేంద్ర ఆర్థిక మంత్రిని కోరాలని సూచించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement