అమరావతి, ఆంధ్రప్రభ 15వ ఆర్థిక సంఘం నిధులను క్రమం తప్పకుండా గ్రామ పంచాయతీలకు జమ చేయాలని గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు, అఖిల భారత పంచాయతీ పరిషత్ (ఢిల్లీ) జాతీయ కార్యదర్శిడాక్టర్ జాస్తి వీరాంజనేయులు కేంద్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి గిరిరాజ్ సింగ్‌ను కోరారు. రాష్ట్రంలోని సర్పంచుల సమస్యలపై గురువారం మంత్రిని కలిసి దాదాపు 20 నిమిషాల పాటు సుదీర్ఘంగా గ్రామీణ ప్రాంతాల స్థితిగతులపై చర్చించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న స్థానిక సంస్థలకు రావలిసిన 15వ ఆర్థిక సంఘం రెండవ బాకీ నిధులు రూ. 581 కోట్లు-, 14వ ఆర్థిక సంఘం పాత బకాయిలు రూ. 125 కోట్లు నిధులను తక్షణమే గ్రామపంచాయతీలు ఖాతాలో జమ చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగినదని తెలిపారు. అలాగే రాజ్యాంగంలోని 73 ,74 రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామపంచాయతీలకు రాజ్యాంగం కల్పించిన 29 అంశాలను గ్రామ పంచాయతీలకు బదలాయించాలని కోరామన్నారు.
ఉపాధి హామీ పథకం నిధులను క్రమం తప్పకుండా విడుదల చేయాలని, స్వచ్ఛభారత్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న గ్రీన్ గార్డ్, గ్రీన్ అంబాసిడర్‌లకు జీతాలు రెగ్యులర్గా విడుదల చేయాలని కోరామన్నారు. రాష్ట్రంలోని సర్పంచ్‌లు చెప్పిన విషయాలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ , నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, గ్రామపంచాయతీలు స్వతహాగా ఆర్థికంగా వనరులు సమకూర్చుకునే విధంగా ప్రణాళికలు చేసుకోవాలని సర్పంచ్‌లకు సూచించారని, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెంపుదల కోసం ఇంకుడు గుంటలు తవ్వించాలని సూచించారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు టీకృష్ణ మోహన్, సీహెచ్ సాంబశివరావు, అల్లా బక్షు, నాగమణి, సునీత, పీ రామయ్య, నాగరాజు, శ్రీనివాసరాజు, శ్రీకాంత్, జగన్ మోహన్ రెడ్డి, ఎ సాంబశివరావు, చంద్రబోస్, రత్నరాజు, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరాజు, నవీన్, ఆంధ్ర శ్రీనివాస్ రావు, విజయ శేఖర్, బుజ్జి బాబు, యన్ శ్రీనివాసరావు, సురేష్. తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.