Saturday, November 23, 2024

టీచర్ల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌ రిలీజ్‌.. 27 నుంచి ప్రక్రియ షురూ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. పదోన్నతులు, బదిలీలకు షెడ్యూల్‌ రిలీజ్‌ చేసింది. ఈనెల 27 నుంచి టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు షెడ్యూల్‌లో తెలిపింది. టీచర్ల పదోన్నతులు, బదిలీలపై ఈనెల 15న ఉపాధ్యాయ సంఘాలు, జేఏసీలతో మంత్రులు హరీష్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి చర్చించిన విషయం తెలిసిందే. తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం జనవరి 28 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. మార్చి 4వ తేదీ నాటికి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ముగియనుంది. ఈ ప్రక్రియను మొత్తం 37 రోజుల్లో మార్చి 4వ తేదీ నాటికి ముగిసేలా రూపొందించారు. మార్చి 5వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అప్పీళ్లకు అవకాశం కల్పించనున్నారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే టీచర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించిన 15 రోజుల్లో అప్పీళ్లకు పరిష్కరించనున్నారు.

గత కొన్ని రోజులుగా షెడ్యూల్‌ కోసం ఉపాధ్యాయులు ఆతృతగా ఎదురు చూసిన పరిస్థితి నేపథ్యంలో ఎట్టకేలకు సోమవారం నాడు షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్రంలో బదిలీలు, పదోన్నతులపై సాధారణ పరిపాలన శాఖ గతంలో నిషేధం విధించింది. అయితే ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ గురువారం జీవోను విడుదల చేసింది. ఎస్జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా, స్కూల్‌ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9,266 మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందనున్నట్లు గతంలో మంత్రి సబిత ప్రకటించారు.

రాష్ట్రంలో దాదాపు 1.20 లక్షల మంది ఉపాధ్యాయులు ఉండగా వారిలో 40వేల పైచిలుకు టీచర్లు బదిలీ అవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో 2015లో బదిలీలతోపాటు ప్రమోషన్లు చేపట్టగా, 2018లో బదిలీలు మాత్రమే నిర్వహించారు. తొలిసారిగా 2018లో ఆన్‌లైన్‌ విధానంలో బదిలీలు చేపట్టారు. ఈసారి కూడా ఆన్‌లైన్‌లోనే బదిలీలను చేపట్టనుండగా, మ్యాన్‌వల్‌గా మాత్రం పదోన్నతులు చేపట్టనున్నారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారంతా అర్హులు కావడంతో దాదాపు 40 వేలకు మందికిపైగా టీచర్లు బదిలీలు అయ్యే అవకాశం ఉంది. టీచర్ల పదోన్నతుల కారణంగా రాష్ట్రంలో మరో 7వేల వరకు ఎస్జీటీ పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం ఉన్నది. ఎస్జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలుగా కల్పించడంతో ఆయా పోస్టులు ఖాళీ కానున్నాయి. ఇప్పటికే గుర్తించిన ప్రకారం 6500కుపైగా ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉండగా తాజాగా మరో 7వేలకు ఖాలీలు ఏర్పడనున్నాయి. దీంతో మొత్తంగా 13,500 ఎస్జీటీ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది.

- Advertisement -

స్పౌజ్‌ వాళ్లకు డిప్యూటేషన్లు..!

స్పౌజ్‌ కేసులు పరిష్కరించాలని కొన్ని రోజులుగా టీచర్లు ఆందోళన బాటపడుతున్నారు. 317 జీవో కారణంగా వేరు వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలు దాదాపు 2,065 మంది వరకు ఉన్నారు. వీరంతా తమకు ఒకేచోటుకి మార్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే వీరిలో ప్రస్తుత బదిలీల్లో 20 నుంచి 30 శాతం మందికి మాత్రమే అవకాశం కల్పించనున్నారు. మిగిలిన వారిని ప్రస్తుత బదిలీలు, పదోన్నతుల కౌన్సెలింగ్‌ ముగిసిన తర్వాత వారిని డిప్యూటేషన్‌పై బదిలీ చేస్తామని ఉపాధ్యాయ సంఘాలతో అధికారులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఏ అవాంతరాలు లేకుండా సజావుగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ సాగితే ఈ షెడ్యూల్‌ ప్రకారం పూర్తవుతుంది. లేకుంటే సీనియారిటీ జాబితాల తయారీలో ఏమైనా పొరపాట్లు ఉంటే మాత్రం ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన పీఆర్టీయు…

ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ విదడుదలపై ప్రొగ్రెస్సివ్‌ రికగ్నైజ్డ్‌ టీచర్స్‌ యూనియన్‌ టీఎస్‌ హర్షం వ్యక్తం చేసింది. ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ రిలీజ్‌ చేయడం సంతోషంగా ఉందని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పి.శ్రీపాల్‌ రెడ్డి, బీరెల్లి కమలాకర్‌ రావులు తెలిపారు. 37 రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపట్ల సీఎం కేసీఆర్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement