Monday, November 25, 2024

కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌, ఆర్ధిక శాఖకు ప్రతిపాదనలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కాంట్రాక్టు ఉద్యోగుల కల సాకారం దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కాంట్రాక్టు ఉద్యోగుల కల సాకారం చేసేలా సర్కార్‌ చర్యలు చేపట్టింది. క్రమబద్ధీకరణకు ప్రతిపాదనలు కోరుతూ ఆర్ధిక శాఖ అన్ని శాఖలనుంచి సమగ్ర వివరాలను సేకరించింది. తాజా వివరాలతో త్వరలో 11103 పోస్టులు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించనున్నారు. రాష్ట్రంలో 80,039 పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్‌ అసెంబ్లిలో చేసిన ప్రకటన సందర్భంలోనే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ కూడా చేస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలను క్రమబద్దీకరణకు వీలుగా ఆర్ధిక శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. 2016 ఫిబ్రవరి 26న ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రయత్నించింది. ఈ మేరకు అప్పట్లో ఉత్తర్వులు కూడా వెలువరించారు. అదే రోజున ఇందుకు సంబంధించి మెమోను కూడా విడుదల చేసింది అయితే దీనిపై కొందరు కోర్టుకు వెళ్లడంతో 2017లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల కారణంగా క్రమబద్ధీకరణ ప్రక్రియ నిల్చిపోయింది. ఆ తర్వాత 2021 డిసెంబర్‌ 7న హైకోర్టు తుది తీర్పులో భాగంగా గతంలో పేర్కొన్న రిట్‌ పిటిషన్‌ 122ను కొట్టివేసింది. ఈ కారణంగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.

అన్ని వివరాల సేకరణ…

సీఎం కేసీఆర్‌ శాసనసభలో ప్రకటించినట్లుగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు శాఖల వారీగా ప్రతిపాదనలు కోరుతూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసి వివరాలను సేకరించింది. 2016లో జారీచేసిన జీవో 16 ఉత్తర్వులకు అనుగుణంగానే అర్హులైన వారి ప్రతిపాదనలు పంపాలని కోరారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేసన్‌, రోస్టర్‌ పాయింట్లకు అనుగుణంగానే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ జరపనున్నారు. ఆర్ధిక శాఖ వివరాల సేకరణ తర్వాత పరిశీలన, ఆమోదంతో ఈ ప్రక్రియ ముగించనున్నారు.

సీనియార్టీ, రోస్టర్‌ల పరిశీలన…

మార్చి 9న అసెంబ్లి వేదికగా సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనతో ఆర్ధిక శాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. అయితే రాష్ట్ర ఆవిర్భావం సమయంలోనే ఈ అంశంపై సీఎం కేసీఆర్‌ పలు సందర్భాల్లో మానవీయ కోణంలో మాట్లాడుతూ వారిని రెగ్యులరైజ్‌ చేస్తామని పేర్కొంటూ వచ్చారు. అయితే రాష్ట్రంలో కొత్త జోనల్‌ విధానం మేరకు కొత్త జిల్లాలు, జోన్లు, మల్టి జోన్లకు సంబంధించి ఉద్యోగులు, అధికారులకు చెందిన రోటేషన్‌ పద్దతి, రోస్టర్‌ ,సీనియార్టీలను ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా భర్తీ చేయనున్న పోస్టుల్లోనూ రోస్టర్ను నిర్ధారించాలని ఆదేశిస్తూ ఇప్పటికే జీవో 44ను జారీ చేసింది. 2018 ఆగష్టు 30నుంచి ఇది అమల్లోకి వస్తున్నట్లుగా పేర్కొంది. నూతన జోనల్‌ విధానం తర్వాత సర్దుబాట్లలో భాగంగా 50వేలకుపైగా ఉద్యోగులు కొత్త జిల్లాలు, జోన్లు, మల్టి జోన్లకు వెళ్లారు. వారి సీనియార్టీ ఇంకా ఖరారు చేయలేదు. దీనికి రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం రోస్టర్‌ను ప్రాతిపదికగా తీసుకోవాల్సి ఉంది.

- Advertisement -

ప్రస్తుతం ఇలా…

ప్రస్తుతం రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంనుంచి అమలవుతున్న 50శాతం రిజర్వేషన్లు కొనసాగించనున్నారు. ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 6శాతం, బీసీలకు 29శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పేరుతో దీనినే రోస్టర్‌ విధానంగా పరిగణిస్తున్నారు. 1నుంచి వంద పాయింట్ల ప్రాతిపదిక అమలులో ఉంది. ప్రస్తుతం అమలులో ఉన్న రోస్టర్‌ పాయింట్లలో మొదటి పాయింట్‌ ఓసీ మహిళ, రెండోది ఎస్సీ మహిళ, మూడవది ఓసీ, నాల్గొవది బీసీ-ఏ, ఐదోది ఓసీ, ఆరోది ఓసీ దివ్యాంగ మహిళ, ఏడవది ఎస్సీ, ఎనిమిది ఎస్సీ మహిళ, తొమ్మిది ఓసీ, పదవది బీసీ-బి మహిళ వంటి వంద పాయింట్లు అమలులో ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement