హైదరాబాద్, ఆంధ్రప్రభ: దసరాకు కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్దీకరణ వరం ప్రకటించేలా సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాంట్రాక్టు ఉద్యోగుల కల సాకారం దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రతిపాదనలు కోరుతూ ఆర్ధిక శాఖ మంగళవారం అన్ని శాఖలకు నోట్‌ను పంపింది. వీలైనంత త్వరగా ప్రతిపాదనలు పంపాలని ఆర్ధిక శాఖ ఆదేశించింది. 11103 పోస్టులు కాంట్రాక్టు ఉద్యోగులతో క్రమబద్దీకరించనున్నారు. రాష్ట్రంలో 80,039 పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ అసెంబ్లిలో చేసిన ప్రకటన సందర్భంలోనే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలను క్రమబద్దీకరణకు వీలుగా ఆర్ధిక శాఖకు అందించాలని నోట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో మార్చి 29న జారీ చేసిన నోట్ ఆధారంగా కసరత్తు ముమ్మరం చేశారు. ఇందుకు అనుగుణంగా రోస్టర్ పాయింట్ల రిజర్వేషన్లను కూడా పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించారు. 50శాతం రిజర్వేషన్లలో భాగంగా ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 6శాతం, బీసీలకు 29శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉంది.
2016లోనే కార్యాచరణ…
2016 ఫిబ్రవరి 26న ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రయత్నించింది. ఈ మేరకు అప్పట్లో ఉత్తర్వులు కూడా వెలువరించారు. అదే రోజున ఇందుకు సంబంధించి మెమోను కూడా విడుదల చేసింది అయితే దీనిపై కొందరు కోర్టుకు వెళ్లడంతో 2017లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల కారణంగా క్రమబద్ధీకరణ ప్రక్రియ నిల్చిపోయింది. ఆ తర్వాత 2021 డిసెంబర్ 7న హైకోర్టు తుది తీర్పులో భాగంగా గతంలో పేర్కొన్న రిట్ పిటిషన్ 122ను కొట్టివేసింది. ఈ కారణంగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.
తాజాగా ఆర్ధిక శాఖ ఆదేశాలు…
సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించినట్లుగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు శాఖల వారీగా ప్రతిపాదనలు కోరుతూ ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. 2016లో జారీచేసిన జీవో 16 ఉత్తర్వులకు అనుగుణంగానే అర్హులైన వారి ప్రతిపాదనలు పంపాలని కోరారు. రూల్ ఆఫ్ రిజర్వేసన్, రోస్టర్ పాయింట్లకు అనుగుణంగానే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ జరపనున్నారు. ఆర్ధిక శాఖ వివరాల సేకరణ తర్వాత పరిశీలన, ఆమోదంతో ఈ ప్రక్రియ ముగించనున్నారు.
సీనియార్టీ, రోస్టర్‌ల పరిశీలన…
మార్చి 9న అసెంబ్లి వేదికగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో ఆర్ధిక శాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. అయితే రాష్ట్ర ఆవిర్భావం సమయంలోనే ఈ అంశంపై సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో మానవీయ కోణంలో మాట్లాడుతూ వారిని రెగ్యులరైజ్ చేస్తామని పేర్కొంటూ వచ్చారు. అయితే రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం మేరకు కొత్త జిల్లాలు, జోన్లు, మల్టి జోన్లకు సంబంధించి ఉద్యోగులు, అధికారులకు చెందిన రోటేషన్ పద్దతి, రోస్టర్ ,సీనియార్టీలను ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా భర్తీ చేయనున్న పోస్టుల్లోనూ రోస్టర్ను నిర్ధారించాలని ఆదేశిస్తూ ఇప్పటికే జీవో 44ను జారీ చేసింది. 2018 ఆగష్టు 30నుంచి ఇది అమల్లోకి వస్తున్నట్లుగా పేర్కొంది. నూతన జోనల్ విధానం తర్వాత సర్దుబాట్లలో భాగంగా 50వేలకుపైగా ఉద్యోగులు కొత్త జిల్లాలు, జోన్లు, మల్టి జోన్లకు వెళ్లారు. వారి సీనియార్టీ ఇంకా ఖరారు చేయలేదు. దీనికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం రోస్టర్‌ను ప్రాతిపదికగా తీసుకోవాల్సి ఉంది.
ప్రస్తుతం ఇలా…
ప్రస్తుతం రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంనుంచి అమలవుతున్న 50శాతం రిజర్వేషన్లు కొనసాగించనున్నారు. ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 6శాతం, బీసీలకు 29శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పేరుతో దీనినే రోస్టర్ విధానంగా పరిగణిస్తున్నారు. 1నుంచి వంద పాయింట్ల ప్రాతిపదిక అమలులో ఉంది. ప్రస్తుతం అమలులో ఉన్న రోస్టర్ పాయింట్లలో మొదటి పాయింట్ ఓసీ మహిళ, రెండోది ఎస్సీ మహిళ, మూడవది ఓసీ, నాల్గొవది బీసీ-ఏ, ఐదోది ఓసీ, ఆరోది ఓసీ దివ్యాంగ మహిళ, ఏడవది ఎస్సీ, ఎనిమిది ఎస్సీ మహిళ, తొమ్మిది ఓసీ, పదవది బీసీ-బి మహిళ వంటి వంద పాయింట్లు అమలులో ఉన్నాయి.
పలు పోస్టులకు ఆర్దిక శాఖ ఆమోదం…
త్వరలో భర్తీ చేయనున్న కొత్త పోస్టుల్లోనూ రోస్టర్‌లను ఖరారు చేస్తారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణలో కూడా ఇదే విధానం అమలు చేస్తారు. ఇందుకు ముందుగా ఇవన్నీ తేలాల్సి ఉంది. ఈలోగా వివరాలను సేకరించి అర్హుల జాబితాను సిద్దం చేస్తారు. వీటిపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఆయన ఆమోదంతో వారిని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి సర్వీస్‌తోపాటు, ఇతర ప్రభుత్వ సౌకర్యాలు వర్తిస్తాయి. తాజాగా ఆర్ధిక శాఖ 50వేల పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఉపాధ్యాయ నియామకాలకు వీలుగా టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టెట్)కు విద్యాశాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ప్రకటనకు వీలుగా రాష్ట్రంలో ఉద్యోగ భర్తీ ప్రక్రియ ఊపందుకుంది.ఈ మేరకు శాఖల వారీగా ముమ్మర కసరత్తు మొదలైంది. ఒక్కో నియామక సంస్థ ఒక్కో సమయంలో వేర్వేరు నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు విస్తృతం చేసేలా కార్యాచరణ ముగింపుకు చేరింది. వీలైనంత తొందర్లో 80,039 పోస్టుల భర్తీకి వీలుగా శాఖల వారీగా నోటిఫై చేసే కార్యాచరణ చురుగ్గా కొనసాగుతోంది.