Friday, November 22, 2024

సమస్యల వలయంలో రీజ‌న‌ల్ రింగ్‌రోడ్డు.. భూ సేకరణ నిధుల వివాదం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన బాహ్య వలయ రహదారి (రీజనల్‌ రింగ్‌ రోడ్డు) నిర్మాణానికి వరుస సమస్యలు ఎదురవుతున్నాయి. రాష్ట్ర్ర రాజధాని హైదరాబాద్‌కు సమీప జిల్లాల నుంచి వచ్చే వాహనాలతో నగరంపై ట్రాఫిక్‌ భారం పడకుండా అంతర్గత రహదారులను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం భారత్‌మాల పరియోజన ప్రాజెక్టులో భాగంగా రీజనల్‌ రింగ్‌ రోడ్డును జాతీయ రహదారిగా నిర్మించనుంది.

అయితే, దీనికి అయ్యే భూ సేకరణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం సగం భరించనుంది. రీజనల్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా ఉత్తర భాగానికి సంబంధించి అన్ని సర్వేలు, అలైన్‌మెంట్‌ గుర్తింపు పూర్తయి భూ సేకరణ చేయాల్సిన తరుణంలో ప్రాజెక్టు పెండింగ్‌లో పడేలా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్తర భాగంలో సంగారెడ్డి, కంది, నర్సాపూర్‌, తూఫ్రాన్‌, గజ్వేల్‌, గజదేవ్‌పూర్‌, భువనగిరి, చౌటుప్పల్‌, ఆమనగల్‌, యాచారం, కందుకూరు, షాద్‌నగర్‌, చేవెళ్ల ఉన్నాయి. రీజనల్‌ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి 162 కి.మీ.ల పొడవునా 2 వేల హెక్టార్ల భూమిని సమీకరించాల్సి ఉంది. ఇందుకు పరిహారంగా రూ.5,170 కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉంటుందని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఐ) అంచనా వేసింది.

ఇందులో 50 శాతం మొత్తం రూ. 2,585 కోట్లు విద్యుత్‌ స్థంభాలు వంటి వాటిని తరలించడం, ఇతర ఖర్చులకు మరో రూ.363.43 కోట్లు వ్యయం అవుతుందని లెక్కలు వేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద చెల్లించాల్సిన నిధులు విడుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికి మూడు లేఖలు రాసినప్పటికీ ఎలాంటి స్పందన రావడం లేదని ఎన్‌హెచ్‌ఐ అధికారులు పేర్కొంటున్నారు. రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో భాగంగా రైతులు, ప్రైవేటు వ్యక్తుల నుంచి భూ సేకరణకు సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉందనీ, ఈ లోపే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయాలనీ, ఆ మేరకు నిధులు కూడా అందజేయాలని ఎన్‌హెచ్‌ఎఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.

- Advertisement -

రాష్ట్ర నిధుల వాటా లేని పక్షంలో పరిహారం చెల్లింపులో న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయనీ, దీంతో రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో జాప్యం జరిగి నిర్దిష్ట వ్యవధిలో పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం రీజనల్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిపాదించినప్పుడు ఉత్తర భాగానికి రూ.9 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే, కోవిడ్‌ వల్ల రెండేళ్లు ఈ పనులు ప్రాథమిక దశలోనే నిలిచిపోగా ఇప్పటికే అంచనా వ్యయం రూ.15 వేల కోట్లకు చేరువైంది.

ఇంకా జాప్యం జరిగితే ప్రామాణిక ధరల పట్టికలో మార్పులు వచ్చి అంచనా వ్యయం మరో రూ.2-3వేల కోట్ల వరకు పెరిగే అవకావం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రోడ్డు త్వరగా అందుబాటులోకి వస్తే ఆయా ప్రాంతాలు వాణిజ్యపరంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉండటంతో పాటు పెట్టుబడులు పెరిగి స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇదిలా ఉండగా, రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి సంబంధించి భూ వ్యయంలో ముందుగా కొంత భాగాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలనీ, ఆ వాటా విడుదల చేయకపోవడంతోనే రాష్ట్రం తన వాటా నిధులను విడుదల చేయకపోవడానికి కారణమని మరో వాదన.

Advertisement

తాజా వార్తలు

Advertisement