Friday, November 22, 2024

నేనున్నా, బీజేపీపై ప్రాంతీయ పార్టీలు పోరాడలేవు.. కష్టపడండి పార్టీని బలోపేతం చేయండి: రాహుల్

ఉదయ్‌పూర్ (రాజస్థాన్‌) : కాంగ్రెస్‌కు ప్రజలతో సంబంధాలు తెగిపోయాయని పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌గాంధీ అంగీకరించారు. ప్రస్తుతం ఏ ప్రాంతీయ పార్టీ కూడా బీజేపీపై పోరాడటం లేదని పేర్కొంటూ, బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌ పార్టీని పునర్నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారంనాడు ‘చింతన్‌ శిబిర్‌’ ముగింపు సమావేశంలో రాహుల్‌గాంధీ ప్రసంగిస్తూ… కీలక వ్యాఖ్యలు చేశారు. ”స్వాతంత్య్రం పూర్వం నుంచి ఇప్పటి వరకు ప్రజలతోనే మమేకమై ఉన్నాం. దేశంలో మరే ఇతర పార్టీకి ఇంత సుదీర్ఘ చరిత్ర లేదు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు ప్రజలతో ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయన్న విషయాన్ని మనం అంగీకరించాలి. ఈ సంబంధాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. నేరుగా ప్రజలతోనే సంబంధం అనేది కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే ఉంది. అక్టోబర్‌లో ప్రజల్ని కలవబోతున్నాం. యాత్ర నిర్వహించి సంబంధాలను బలోపేతం చేసుకోబోతున్నాం. దీనికి ఎలాంటి షార్ట్‌ కట్‌లు లేవు. కష్టపడి పనిచేస్తేనే ఇది సాధ్యం. కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతలు భయపడాల్సిన అవసరం లేదు. నా జీవిత చరమాంకం వరకు మీతోనే ఉంటా. ఈ పోరాటంలో మీతో కలిసి నడుస్తా. కాంగ్రెస్‌ పార్టీకి ఇకపై ఏం చేయాలో తెలుసు” అని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.

మేధోమథనంలో చర్చలు విస్తృతంగా జరగడం అభినందనీయమన్నారు. ”నేతలంగా తమ భావాలను సూటిగా చెప్పారు. ఎటువంటి భయాలు లేకుండా చర్చలకు కాంగ్రెస్‌ వేదిక కల్పించింది. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ ఇలాంటి వాటిని అనుమతించవు. ఇప్పుడు దేశంలో ఎవరినీ మాట్లాడనీయకుండా చేస్తున్నారు. భాజపాలో మైనారిటీలు దళితులకు సరైన స్థానమే లేదు. దీని పర్యవసనాలు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు. దీనంతటికీ బీజేపీ ప్రభుత్వానిదే బాధ్యత” అని రాహుల్‌ గాంధీ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ”నేను ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదు, డబ్బు తీసుకోలేదు. నేను భయపడను, ద్వేషం, హింస సిద్ధాంతాలపై కాంగ్రెస్‌ పోరాడుతోంది, ఇది తన జీవితకాల పోరాటం” అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వారు చేస్తున్నట్లుగా వివిధ సంస్థల్లోకి చొరబడడం మాకు నచ్చలేదు. అట్టడుగు స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని మనం దూకుడుగా మార్చుకున్నప్పుడు మనం ఆర్‌ఎస్‌ఎస్‌ని ఎదుర్కోగలుగుతాం. కాంగ్రెస్‌ పార్టీలాగా ప్రాంతీయ పార్టీలు పోరాడలేవు అని వ్యాఖ్యానించారు. దేశాన్ని రాష్ట్రాల సమాఖ్యగా పేర్కొన్న రాహుల్‌, రాష్ట్రాల కలయికతోనే కేంద్రం ఏర్పడిందని రాజ్యాంగం చెబుతోందన్నారు. దేశంలోని వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement