హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఈ విద్యా సంవత్సరం (2022-23) ఫార్మసీ సీట్లల్లో కోతపడనుంది. రాష్ట్రంలో గత విద్యాసంవత్సరం మొత్తం బీఫార్మసీ, ఫార్మ్-డీ సీట్లు 13,799 ఉన్నాయి. అయితే ఇందులో ఈసారి దాదాపు 2000కుపైగా సీట్లు ఈ విద్యా సంవత్సరంలో కొతపడనున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఫార్మసీ కాలేజీలకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) ఇటీవల షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో దాని ప్రభావం ఈ విద్యాసంవత్సరం సీట్లపై పడనున్నది. ఫార్మసీ కళాశాలల్లో పీసీఐ బృందాలు జరిపిన తనిఖీల్లో ఆయా కాలేజీలు నిబంధనలమేర నడుచుకోవట్లేదని తేలడంతో బీఫార్మసీ, ఫార్మ్-డీ, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లోని సీట్లలో భారీగా కోత విధిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సీట్ల కోత అంశం ఈ విద్యా సంవత్సరం రాష్ట్రంలో అందుబాటులో ఉండే సీట్లపై తీవ్ర ప్రభావం చూపనుంది.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఫార్మసీ కాలేజీల్లో పీసీఐ అధికారులు చేపట్టిన తనిఖీల్లో అర్హులైన అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు లేరని, ఉద్యోగులకు నిబంధనల మేరకు జీతాలు ఇవ్వడంలేదని గుర్తించారు. ఈ క్రమంలో బీఫార్మసీ కాలేజీల్లోని బీఫార్మసీ సీట్లను 100 నుంచి 60కు తగ్గిస్తూ పీసీఐ సెప్టెంబర్ నెలలో పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఫార్మ్-డి సీట్లను 30 నుంచి 20కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకోగా, ఎంఫార్మసీలో 30 సీట్లుండగా కొన్ని కాలేజీల్లో 20కి, మరికొన్ని కాలేజీల్లో 10కి తగ్గిస్తూ పీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ విద్యా సంవత్సరం 2022-23 బీ-ఫార్మసీ, ఫార్మ్-డీ సీట్లు భారీగా తగ్గనున్నాయి. ఈ ప్రభావం దేశవ్యాప్తంగా కనిపించనుంది.
అప్పీల్‌కు వెళ్లిన కాలేజీలు…
కొన్ని కాలేజీల్లో 100 సీట్ల నుంచి 60కి, 30 నుంచి 20కి, 30 నుంచి 10కి సీట్లను తగ్గిస్తూ పీసీఐ తీసుకున్న నిర్ణయంపై కళాశాల యాజమాన్యాలు అప్పీల్‌కు వెళ్లాయి. ఇప్పటికే రెండు మూడు సార్లు సమావేశమైనట్లు ఫార్మసీ కాలేజీల యాజమాన్య సంఘాల నేతలు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫార్మసీ కాలేజీలు 122 ఉండగా, ఒక్కొక్క కాలేజీలో 60 వరకు బీ-ఫార్మసీ సీట్లు ఉంటే, 55 ఫార్మ్-డీ కాలేజీల్లో 30 చొప్పున సీట్లు ఉన్నాయి. ఇందులో మొత్తం సీట్లు దాదాపు 13,850 వరకు ఉండేవి. అయితే గత విద్యా సంవత్సరం కౌన్సెలింగ్‌లో… అధికారులు చెప్పిన దానిప్రకారం మాత్రం బీ-ఫార్మసీ, ఫార్మ్-డీ 13799 సీట్లల్లో 12,736 సీట్లు మాత్రం భర్తీ అయినట్లు తెలిపారు. అయితే కాలేజీ యాజమాన్యాలు అప్పీల్‌కు వెళ్లడంతో ఎన్ని సీట్లు ఉంటాయనేది తేలాల్సి ఉంది. ఈ సారి మొత్తం సీట్లలో 2000 వరకు సీట్లు కోత పడనున్నట్లు కాలేజీ యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఈ నెలాఖరు వరకల్లా సీట్ల అంశం కొలిక్కి రానున్నట్లు తెలుస్తోంది. దీనిపైన పీసీఐ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
నవంబర్ 1 నుంచి కౌన్సెలింగ్….
టీఎస్ ఎంసెట్ (బైపిసి)-2022 అడ్మిషన్స్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ శనివారం ప్రకటించారు. మొదటి విడత కౌన్సెలింగ్ నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. అదే రోజు నుంచి 3వ తేదీ వరకు స్లాట్ బుకింగ్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపుకు అవకాశం కల్పించారు. నవంబర్ 3 నుంచి 4 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. 6 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. మొదటి విడత సీట్లను నవంబర్ 9న కేటాయించనున్నారు. అదేనెల 13వ తేదీ వరకు ట్యూషన్ ఫీజు చెల్లించి, సీటు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవల్సి ఉంటుంది. ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ నవంబర్ 17 నుంచి ప్రారంభమవగా, తుది విడత సీట్లను 22న కేటాయించనున్నారు. సీటు పొందిన అభ్యర్థులు నవంబర్ 22 నుంచి 25 వరకు నేరుగా కాలేజీలకు వెళ్లి రిపోర్టింగ్ చేయాలన్నారు. స్పాట్ అడ్మిషన్స్‌కు సంబంధించిన వివరాలను నవంబర్ 23న వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.