న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రోగ్రాం ద్వారా పొగాకు రైతులను ఇతర పంటల సాగుకు మారేందుకు ప్రోత్సహిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఇది అమలవుతోందని రాజ్యసభలో ఎంపీ మహేశ్ పొద్దార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. దేశంలో పొగాకు సాగు 2014-15లో 4.67 లక్షల హెక్టార్ల నుంచి 2019-20 నాటికి 4.04 లక్షల హెక్టార్లకు తగ్గిందని ఆమె తెలిపారు. పొగాకు సాగు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో జరుగుతోందని, దేశీయంగా, అంతర్జాతీయంగా పొగాకు ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతున్నందున సాగు కూడా తగ్గుతోందని వెల్లడించారు. పొగాకు సాగు నుంచి ఇతర పంటల సాగుకు మారే రైతుల కోసం ఏపీ, కర్నాటకల్లో ఉద్యానవన శాఖలు పొగాకు బోర్డుతో కలిసి సాంకేతిక సహకారం అందిస్తున్నామన్నారు. గత మూడేళ్లలో పొగాకు ఉత్పత్తులపై విధించే జీఎస్టీ, కాంపెన్సేషన్ సెస్, ఎక్సైజ్ డ్యూటీ, నేషనల్ కెలామిటీ అండ్ కంటింజెంట్ డ్యూటీ ద్వారా సగటున రూ. 53,750 కోట్ల ఆదాయం సమకూరుతోందని కేంద్ర మంత్రి తెలిపారు.
మరోవైపు బీజేపీ రాజ్యసభ సభ్యులు, కేంద్ర దిశ కమిటీ రాష్ట్ర ప్రతినిధి, జాతీయ పొగాకు బోర్డు సభ్యులు జీవీఎల్ నరసింహారావు గత ఐదేళ్లుగా దేశవ్యాప్తంగా పొగాకు, పొగాకు ఉత్పత్తుల ఎగుమతులు, తెగుళ్ల నిరోధక చర్యల వివరాలు తెలపాలని ప్రశ్నించగా… పొగాకు, పొగాకు ఉత్పత్తుల విలువ 2016-17లో రూ. 6,423 కోట్ల విలువైన రెండు లక్షల 39 వేల 909 మెట్రిక్ టన్నులు కాగా… 2020-21కి రూ. 6,496 కోట్ల విలువైన రెండు లక్షల 14 వేల నాలుగు వందల పన్నెండు మెట్రిక్ టన్నులకు చేరుకుందని అనుప్రియ పటేల్ వెల్లడించారు. కోవిడ్, ప్రపంచవ్యాప్తంగా పొగాకు వ్యాపారం పూర్తిగా మందగించడం, వివిధ దేశాల్లో పొగాకు ఉత్పత్తులపై నిషేధం వల్ల పొగాకు ఎగుమతులు తగ్గాయని ఆమె తెలిపారు. పొగాకు బోర్డు దేశీయ ఎగుమతులు పెంచడానికి అనేక చర్యలు చేపట్టిందని, భారత్‌లో పండే పొగాకు నాణ్యతను, ఉత్పాదకతను పెంచడానికి, అంతర్జాతీయ పొగాకు వాణిజ్య సమ్మేళనాలను ఏర్పాటు చేసి ఇతర దేశాల నుంచి పొగాకు వ్యాపార సంస్థల ప్రతినిధులను ఆహ్వానించి వారికి మన పొగాకు నాణ్యత గురించి తెలియజెప్పే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..,