హైదరాబాద్, ప్రభన్యూస్ : శీతాకాలం ప్రారంభంలోనే హైదరాబాద్ మహానగరాన్ని చలి వణికిస్తుంది. ఆక్టోబర్ చివరి వారంలో మొదలైన చలి రోజు రోజుకు పెరుగుతుంది. గత 24, 25 తేదీలలో 14 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 16 , 17డిగ్రీల వద్ద స్థిరంగా ఉంటుంది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గి, చలి క్రమంగా పెరుగుతోంది. గరిష్టంగా 27 నుంచి 28 డిగ్రీలు, కనిష్టంగా 15 నుంచి 17 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో చలి పెరుగుతోంది. దీంతో ఉదయం పూట చలి ఎక్కువగా ఉంటోంది. ఉదయం 8నుంచి 9 గంటల వరకు జనాలు రోడ్లపైకి రావడానికి జంకుతున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గి పోవడం, చలి గాలులు వీస్తుండడంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణం మారడంతో చాలా మంది జ్వరం, సర్థి, దగ్గుతో ఇబ్బందులు పడుతున్నారు. చలి గాలులు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
గ్రేటర్ పరిధిలో ఉష్ణోగ్రతలు తగ్గి.. చలి క్రమంగా పెరుగుతోంది. ఉష్ణోగ్రత గరిష్ణంగా 27 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ , కనిష్టంగా దాదాపు 15 నుంచి 17 డిగ్రీల సెల్సియస్ నమోదు కావడంతో నగరంలో రోజు రోజుకు చలి పెరుగుతోంది. మరోవైపు ఉదయం పూట సూర్యుడు సైతం కన్పించకపోవడంతో చలి ఎక్కువగా ఉంటోంది. దీంతో ఉదయం నడకకు వెళ్లే జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి గాలులకు తోడు మంగళవారం నగరంలో చిరు జల్లులు పడడంతో చలి మరింత పెరగవచ్చంటున్నారు. ఆక్టోబర్ మూడవ వారం వరకు వర్షాలు కురిశాయి. గత మూడు నాలుగు నెలల పాటు భారీ వర్షాలు పడిన సమయంలో కూడా చలి ప్రభావం కనిపించలేదు. అయితే ఒక్కసారి వాతావరణంలో మార్పు రావడంతో జనాల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యనిపుణులు అంటున్నారు.
రానున్నరోజుల్లో పగటి ఉష్ణోగ్రతలుపెరిగి..రాత్రివేళ చలి అధికంగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ తెలియజేసింది. తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో చలి పెరిగిన ప్రభావం విద్యుత్ డిమాండ్‌పై పడింది. గత వారం రోజుల వరకు గ్రేటర్ పరిధిలో విద్యుత్ వినియోగం 55 మిలియన్ యూనిట్ల నుంచి 45 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. గత వారం రోజులుగా హైదరాబాద్ మహానగరంలో విద్యుత్ డిమాండ్ 43 ఎం.యూల నుంచి 46 ఎంయూల మధ్య స్థిరంగా కొనసాగుతుంది.
చలి తీవ్రత పెరగడంతో చలి తీవ్రత నుంచి తట్టుకోవడానికి ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందు కోసం జనాలు ఎక్కువగా మంకీ క్యాప్స్, మఫ్లర్స్, ఉలెన్ షటర్స్ , బ్లాంకేట్స్, గ్లౌజ్‌లు వంటి వాటిని కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో శివారు ప్రాంతాలలో రోడ్ల వెంట నెపాల్ ప్రాంతానికి చెందిన వ్యాపారులు పెద్ద ఎత్తున శటర్స్‌కు, మంకీ క్యాప్స్, బ్లాంకేట్స్‌కు సంబంధించిన దుకాణాలను ఏర్పాటు చేశారు. శీతాకాలం ప్రారంభంలోనే చలి తీవ్రత పెరగడంతో తమ వ్యాపారం పెరిగిందని అంటున్నారు.