Wednesday, November 20, 2024

తగ్గిన ఐటీ నియామకాలు.. ఆర్ధిక మందగమనం ప్రభావం

అమెరికా, ఐరోపా దేశాల్లో నెలకొన్న ఆర్ధిక మందగమనం ప్రభావం మన దేశంలోని ఐటీ రంగంపై పడుతున్నది. ఫలితంగా ఈ రంగంలో ఉద్యోగ నియామకాలు తగ్గుతున్నాయి. ఉద్యోగాల సరళిపై ఆన్‌లైన్‌ ఉద్యోగ నియామక సంస్థ నౌక్రీ డాట్‌ కామ్‌ తాజాగా వివరాలు వెల్లడించింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం గత సంవత్సరం మే నెలతో పోల్చితే ఈ మేలో ఐటీ రంగంలో కొత్త నియామకాలు 23 వాతం తగ్గాయి. రిటైల్‌, విద్య-శిక్షణ, బీమా రంగాల్లో కూడా కొత్త ఉద్యోగ నియామకాలు తగ్గాయి. ఇదే మే నెలలో చమురు- సహజ వాయువు రంగంలో ఉద్యోగాలు 31 శాతం పెరిగాయి.

స్థిరాస్తి, బ్యాంకింగ్‌, ఆర్ధిక సేవల రంగాల్లోనూ 14 శాతం ఉద్యోగాలు పెరిగాయని నివేదిక తెలిపింది. ఔషధ, బయోటెక్‌, క్లినికల్‌ పరిశోధన రంగాల్లో 11 శాతం ఉద్యోగాలు పెరిగాయి. వాహన, వాహన విడిభాగాల పరిశ్రమల్లో 10 శాతం, పర్యాటక, అతిథ్య రంగంలోనూ ఉద్యోగాలు 9 శాతం పెరిగాయి. ఇటీవల ఇంధన, విద్యుత్‌ వినియోగం పెరుగుతున్నందున ఈ రంగాల్లో ఉద్యోగ నియామకాలు పెరిగాయి. ఆర్ధిక వ్యవస్థ మెరుగ్గా ఉన్నందున బ్యాంకింగ్‌ కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు పెరుగుతున్నంద ఈ రంగంలోనూ కొత్త ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయని నివేదికి తెలిపింది.

- Advertisement -

ఔషధ రంగంలో నియామకాలు పెరగడం ఆసక్తికర పరిణామంగా ఉంది. కోవిడ్‌ తరువాత ఈ రంగం చాలా వెనుకబడింది. ఉత్పత్తి కార్యకలాపాలు మందగించాయి. కొత్త ఉద్యోగుల అవసరం తగ్గింది. అయితే కొత్త మార్కెట్లను చేరేందుకు చాలా కంపెనీలు కొత్త ఔషధాల తయారీ వైపు దృష్టి సారించాయి. దీని వల్లే ఈ రంగంలో కొత్త ఉద్యోగ నియామకాలు పెరిగాయి. నగరాల వారిగా అహ్మదాబాద్‌, వడోదర, జైపూర్‌, ముంబై, ఢిల్లి నగరాల్లో కొత్త నియామకాలు పెరిగాయి. ఐటీ కార్యకలాపాలకు కేంద్రాలైన బెంగళూర్‌, హైదరాబాద్‌, పుణే, చండీఘడ్‌, కోల్‌కతా, కోయంబత్తూర్‌, కొచ్చి నగరాల్లో కొత్త ఉద్యోగ నియామకాలు తగ్గాయి.

ఎక్స్‌పీరియన్స్‌కు డిమాండ్‌…

ఆయా రంగాల్లో నైపుణ్యం, అనుభవం ఎక్కువగా ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. ఫ్రెషర్స్‌, ఏడేళ్లలోపు అనుభవం ఉన్నవారికి ఉద్యోగాలు దొరకడం కష్టమవుతోంది. అనుభవం అవసరమైన ఉద్యోగాల సంఖ్య పెరుగుతున్నది. 13 నుంచి 16 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని ఈ నివేదిక తెలిపింది.

నియామకాలు తగ్గినవి…

సాఫ్ట్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ సర్వీసెస్‌, ఐటీ రంగాల్లో ఉద్యోగ నియామకాలు 23 శాతం తగ్గాయి. బీమా రంగంలో 15 శాతం, విద్య, బోధన, శిక్షణ రంగాల్లో 16 శాతం, రిటైల్‌ రంగంలో 21 శాతం ఉద్యోగ నియామకాలు తగ్గాయని నౌక్రీ డాట్‌ కామ్‌ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement