ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను సవరించాయి. 19 కేజీల ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరను రూ.99.75 మేర తగ్గించాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,680కు దిగొచ్చింది. అయితే గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎటువంటి మార్పూ లేదు. కొత్త ధరలు నేటి నుంచి అమలులోకి వచ్చాయి.
జులైలో కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.7 పెంచారు. ముంబైలో గతంలో రూ.1733.50 చెల్లించాల్సివుండగా ఇప్పుడు రూ.1640.50కి లభించనుంది. చెన్నైలో కమర్షియల్ గ్యాస్ సిలిండర ధర రూ.1945 నుంచి రూ.1852.50కి తగ్గింది. మార్చి1,2023న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2119.50గా ఉంది. ఆ తర్వాత ఏప్రిల్ లో రూ.2020కి తగ్గింది. మే నెలలో రూ.1856.50కి తగ్గగా, జూన్ 1న రూ.1773కు తగ్గింది. వంటగ్యాస్ ధరలను ఈ ఏడాది మార్చి 1న చివరిసారిగా సవరించారు. వాణిజ్య, వంట గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు నెలకొసారి సవరిస్తూ ఉంటాయి.