Thursday, November 21, 2024

తగ్గిన మిర్చి ఘాటు.. క్షీణించిన ఎగుమతులు

అమరావతి, ఆంధ్రప్రభ ; విదేశాలకు ఎగుమతులు తగ్గడం, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహరాష్ట్ర, తెలంగాణ, కర్ణాటకలో మిర్చి సాగు పెరగడం, దేశీయంగా ఇతర ప్రాంతాల నుంచి కొనుగోళ్లు మందగించడం వెరశి మిర్చి ధరలపై ప్రభావం చూపింది. దీంతో అన్ని రకాల మిర్చి ధరలు క్వింటాకు సుమారు రూ.3వేల వరకూ తగ్గాయి. దీంతో రైతులు, నిల్వదారులు నిరాశతో వున్నారు. ధరలు క్షీణించడంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కోల్డ్‌ స్టోరేజీల్లో ఎండు మిర్చి నిల్వలు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో మంచి ధరలు వస్తాయని భావించి రైతులు, వ్యాపారులు కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేసుకుంటున్నారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లోని 150 కోల్ట్‌ స్టోరేజిల్లో 60 లక్షల టిక్కిల నిల్వలు ఉన్నాయి. .

- Advertisement -

గత 15 రోజుల్లో క్వింటాలుకు రూ.3 వేల వరకు తగ్గింది. సాధారణ రకాలు కనిష్ట ధర క్వింటాలు రూ.9 వేలు, గరిష్ట ధర రూ.24 వేలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. గత నెలలో సాధారణ రకాల కనిష్టంగా రూ.12 వేలు, గరిష్టంగా రూ.26 వేల వరకు ధర వచ్చింది. మేలురకాలైన తేజ, బాడిగ, దేవనారు డీలక్స్‌ రకాలు ధరలు కూడా బాగా తగ్గాయి. 15 రోజుల క్రితం వరకు మేలు రకాలు తేజ, బాడిగ కనిష్టంగా రూ.18 వేలు, గరిష్టంగా రూ.33 వేల వరకు పలికాయి. ప్రస్తుతం వీటి ధరలు కనిష్టంగా రూ.13 వేలు, గరిష్టంగా రూ.27 వేలకు కొనుగోలు జరుగుతోంది.

ఎక్కువ సరుకు కనిష్ట ధరలకే కొనుగోలు చేస్తున్నారు. గతేడాది నవంబరులో మేలు రకాలకు గరిష్టంగా క్వింటాలుకు రూ.45 వేల వరకు ధరలు వచ్చాయి. గృహ అవసరాలకు విక్రయించే రి-టైల్‌ వ్యాపారుల నుంచి కూడా ఆర్డర్లు తగ్గాయి. ధరలు తగ్గడం వల్ల యార్డుకు వచ్చే సరుకు గణనీయంగా తగ్గుతోంది. సోమవారం 37,050 టిక్కిలు రాగా, పాత నిల్వలతో కలిపి 34,864 టిక్కిలు అమ్ముడుపోయాయి. క్వింటాలుకు రూ.3 వేలు వరకు తగ్గినా గరిష్టంగా రూ.16 వేలకు తగ్గడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఆర్డర్లు వస్తే మళ్లీ ధరలు వస్తాయని రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement