Saturday, November 23, 2024

తగ్గిన నగదు ప్రవాహం, షెడ్యూల్‌కు ముందే చేరిన మందు.. ఫోకస్​ పెట్టిన ఈసీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఎన్నికల షెడ్యూల్‌ జారీకి ముందే అనూహ్యంగా రాష్ట్రంలో నగదు లభ్యత కష్టమవుతోంది. కట్టలు కట్టలుగా కనిపించిన నగదంతా ఒక్కసారిగా మార్కెట్‌లో కనిపించకుండా పోయింది. తాజాగా రూ.2వేల నోట్ల ఉపసంహరణ తర్వాత ఆ స్థానాన్ని రూ.500 నోటు కైవసం చేసుకున్నది. రాష్ట్రంలో బ్యాంకులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో, మద్యం దుకాణాల్లో మాల్స్‌లో, ఇతర దైనందిన కార్యక్రమాలనుంచి ప్రతీ దగ్గర ప్రజలవద్ద భారీగా నగదు కనిపించేది. డిజిటల్‌ పేమెంట్ల తర్వాత కూడా నగదుకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన తెలంగాణ ప్రజానీకానికి ఒక్కసారిగా నగదు కష్టాలు ఎదురవుతున్నాయి.

ఇందుకు కారణం ఎన్నికలు తరుముకురావడమేనని మార్కెట్‌ వర్గాలు, ఆర్ధిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికలకు అర్ధబలాన్ని పెంచుకునే పార్టీలు, నేతలు ఇప్పటికే భారీగా నగదును తమ తమ రహస్య స్థావరాల్లో బదీ చేస్తున్నారనే ప్రచారం పెరుగుతోంది. తాజాగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు, ప్రభుత్వ వేలంలో ప్లాట్లు కొన్న బడా సంస్థలు కూడా డబ్బులు పుట్టక లోదిబోమంటున్నాయి.

గతంలో కరోనా తర్వాత ప్రజలు తమ వద్ద నగదు నిల్వ చేసుకునేందుకు ప్రాధాన్యతనిచ్చారు. 2020-21లో కరెన్సీ చెలామణి జీడీపీలో గరిష్టంగా 14.5శాతానికి ఎగబాకింది. అనిశ్చితి, అభద్రతాభావాల నేపథ్యంలో అప్పుడు నగదు దాచేయగా, ఇలా రూ.3.3 లక్షల కోట్లు ప్రజలచేతుల్లో బందీ అయ్యాయి. ఆ తర్వాత ప్రభుత్వ చర్యలతో డిజిటల్‌ పేమెంట్ల వైపు మొగ్గిన ప్రజలు నగదును మార్కెట్‌లోకి వదిలారు. దీంతో నగదుకు కొరత లేకుండా పోయింది. కానీ ఇప్పుడు మళ్లి నగదు కష్టాలు మొదలయ్యాయి.

- Advertisement -

నేతలు, పార్టీలు జోరుగా నగదును నిల్వ చేసుకుంటున్నాయనే ప్రచారం పెరుగుతోంది. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో హుజూరాబాద్‌, మునుగోడులలో రికాస్డు స్థాయిలో వ్యయాలు చేసిన పార్టీలు ఇప్పుడు రాష్ట్రమంతటా ఇది ట్రెండ్‌ను ఫాలో అవనున్నారనే ఆందోళన పెరుగుతోంది. ఇదిలా ఉండగా ఇందుకు బలం చేకూర్చేలా రియల్‌ రంగంలో పెట్టుబడులు తగ్గాయి. రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గముకం పడుతోంది. నిర్మాణ రంగంలో మార్కెట్‌ స్థబ్దుగా మారింది.

కొనుగోలుదారులు లేక భారీ బహుళ అంతస్తుల ఆకాశహర్మ్యాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బ్యాంకుల్లో నగదు జమలు 50శాతం తగ్గినట్లుగా రికార్డులు వెల్లడిస్తున్నాయి. విత్‌ డ్రాయల్‌ రేటు పెరిగిందని బ్యాంకర్లు చెబుతున్నారు. గడచిన నెలరోజులుగా బ్యాంకుల్లో నగదు జమ 20శాతంగా ఉంటే ఉపసంహరణలు 1000 శాతం మేర పెరిగినట్లు బ్యాంకర్ల నివేదికలో వెల్లడైంది. ఇలా లక్షలకోట్లు ఎక్కడికి తరలివెళ్తున్నాయనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

అయితే ఇదంతా ఎన్నికలకు కాస్త ముందు కావడంతో సహజంగానే పార్టీలు, నేతలపై అనుమానాలకు బలం చేకూరుతోంది. మద్యం విక్రయాలు జోరుగా పెరుగుతున్నాయి. రూ.2వేల నోట్ల రద్దు తర్వాత గడచిన రెండు నెలలుగా రాష్ట్రంలో నగదు చెలామణి భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. రియల్‌ రంగంలో కూడా ఇప్పుడు నోట్ల తళతళలు వెలవెలబోతున్నాయని అంటున్నారు. ఒకవైపు రియల్‌ రంగంలో స్థబ్ధత, మరోవైపు మద్యం విక్రయాల్లో పెరుగుదల ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది.

ఈ క్రమంలో ఎన్నికల్లో మద్యం, నగదుపై దృష్టిసారించిన ఎన్నికల సంఘం కీలక చర్యలకు దిగుతోంది. న్నికల్లో ఈ రెండూ అత్యంత కీలకం. ఓటర్లు మొదలు రాజకీయ పార్టీల వరకు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి సిద్దం చేసుకుంటాయి. అదేవిధంగా ఎన్నికల వేళ ఆబ్కారీ శాఖకు రాబడి కూడా అంతే ప్రతిష్టాత్మకం. ఈసీ ప్రతీయేడు చెప్పినట్లుగానే నిఘా పెడుతున్నామని ప్రకటిస్తుంది. ఎక్కడికక్కడ లెక్కలు చూపమంటుంది. ప్రతీ ఎన్నికల్లో మద్యం ఏరులై ప్రవహిస్తోందని రాజకీయ పార్టీలన్నీ ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటారు.

ఇది సహజమే అయినా గత నెల రోజులుగా రాష్ట్రంలో ఎన్నికల వేడితో మద్యం ఏరు కంటే స్పీడుగా గంగ వెర్రులెత్తుతోంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు ముగిసినప్పటికీ, గడువులోగానే ఎన్నికలని ఈసీ ప్రకటించిన తదుపరి, సీఈసీ టూర్లు, రాజకీయ పార్టీల సందడి, అభ్యర్ధుల ప్రకటన వంటి అంశాలన్ని మందుపై ప్రభావం చూపుతున్నాయి. గత 20 ఏళ్ల చరిత్రను తిరగరాసేలా రాష్ట్రంలో మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. రాజకీయాల్లో నగదు అక్కర ఎక్కువ కావడంతో రియల్‌ వ్యాపారంలో పెట్టుబడులు తగ్గిన పరిస్థితి కనిపిస్తోంది.

అయితే ఇందుకు భిన్నంగా మద్యం వినియోగం మాత్రం గణనీయంగా పెరిగింది. బడా నేతలు, రాజకీయ వేడి అధికంగా ఉన్న జిల్లాల్లో మద్యం విక్రయాలు అమాంతంగా పెరిగాయి. ఎంతలా అంటే కనీసం నెలకు రూ. 30కోట్లకు కూడా కష్టమైన ఆయా ప్రాంతాల్లో నెలలో రూ. 50 కోట్లను అలవోకగా దాటేలా అమ్మకాలు పుంజుకున్నాయి. మద్యం విక్రయాలపై ఎన్నికల సంఘం నిఘా పెట్టినప్పటికీ అదింకా క్షేత్రస్థాయికి చేరలేదు. త్వరలో నోటిఫికేషన్‌ వస్తుందన్న అంచనాల నేపథ్యంలో మద్యం విక్రయాలపై నిఘా కొరవడింది.

ఈ నేపథ్యంలో మద్యం వ్యాపారాలు ముందస్తు స్టాకును సిద్దం చేసుకుంటున్నారని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో మద్యం విడుదలపై కొంత నియంత్రణ విధిస్తారనే సమాచారంతో వ్యాపారులు అప్రమత్తమయ్యారు. గతేడాది విక్రయాల ఆధారంగా స్టాకును ఇస్తారని, కొంత రేషన్‌ విధించనున్నారని తెలియడంతో ముందస్తు నిల్వలు పెంచుకుంటున్నారని తెలుస్తోంది. ఎప్పుడూ లేని రీతిలో మద్యం డిపోలనుంచి స్టాకు తరలుతుండటంతో ఆబ్కారీ శాఖ సంబరపడిపోతోండగా, ఎన్నికల సంఘం పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది.

మద్యం విస్తరించేందుకు అవకాశం ఉన్న గ్రామీణ ప్రాంతాలు, మురికివాడలతో పాటు, నాటుసారా, అక్రమ మద్యం, సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా పెంచుతోంది. అయితే కీలకమైన మద్యం విక్రయాలు, అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఎక్సైజ్‌ శాఖను ఆదేశించింది. రాజకీయ పార్టీలు ఓటర్లకు మద్యానికి బదులుగా మద్యం కూపన్లు ఇవ్వడం, ముందస్తు మద్యం నిల్వ చేయడం, నిర్ధిష్ట దుకాణానికి చెందిన కూపన్లను ఇచ్చి ఓటర్లను ప్రలోభ పెట్టే యత్నాలపై ఏవిధంగా దృష్టిసారించాలనే అంశంలో ఆబ్కారీ శాఖ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది.

ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో అక్రమంగా మద్యం నిల్వ చేయడం, ఒక ప్రాంతంనుండి మరో ప్రాంతానికి పెద్ద మొత్తంలో తరలించడం కూడా నేరమేనని ఈసీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక తీవ్ర నేరమైన నాన్‌ డ్యూటీ పెయిడ్‌ మద్యం విక్రయించడం వంటి నేరాలకు మద్యం దుకాణాలు, బార్ల లైసెన్సులను రద్దు చేయాలని నిర్ణయించారు. మద్యం విక్రయాల్లో ఇతర రాష్ట్రాల వృద్ధిరేటు, జాతీయ వృద్ధిని పరిగణలోకి తీసుకోనున్నారు. ప్రతీ జిల్లాకు ఈఎస్‌లను ఎక్సైజ్‌ నోడల్‌ అధికారిగా నియమించి విక్రయాలపై నిఘా మోపనున్నారు.

ప్రతీయేటా 20 శాతం పెరుగుదల ఉంటుందని, కానీ అనూహ్యంగా 50శాతానికిపైగా పెరిగితేనే కఠిన చర్యలు ఉంటాయని ఆబ్కారీ శాఖ అంటోంది. ఒక్కో వ్యక్తి ప్రతీ రోజుకు 6 ఫుల్‌ బాటిళ్లు, 12 బీర్‌ బాటిళ్ళను తీసుకునేందుకు అనుమతి ఉండగా, అంతకంటే ఎక్కువ మొత్తంలో తీసికెళ్తే నేరంగా పరిగణిస్తారు. షెడ్యూల్‌ ప్రకటనకు ముందు నుంచే విక్రయాల జోరు పెరుగుతోంది. రాష్ట్రంలో మద్యం విక్రయాలు ఇప్పటికే భారీగా పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement