హైదరాబాద్, ఆంధ్రప్రభ : భారతీయ రైల్వేలు ఆధునీకరణ దిశగా ముందుకు సాగుతున్నాయి. రైల్వే స్టేషన్లను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దే పనులు దేశవ్యాప్తంగా శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 6న దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో ద.మ.రైల్వే పరిధిలో 50 రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
అమృత్ భారత్ స్టేషన్ పథకం తొలి దశలో భాగంగా తెలంగాణలో 21 స్టేషన్లు, ఏపీలో 15 స్టేషన్లు, మహారాష్ట్రలో 13 స్టేషన్లు, కర్నాటకలో ఒక స్టేషన్‌కు కలిపి రూ.2,079.29 కోట్లు అంచనా వ్యయంగా రైల్వే మంత్రిత్వ శాఖ రూపొందించింది. ఈ స్టేషన్లన్నింటినీ భారతీయ వైవిధ్యం యొక్క గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ పునరాభివృద్ధి చేయబడిన స్టేషన్లు నూతన అత్యాధునిక ప్రయాణికుల సౌకర్యాలతో పాటు ప్రస్తుత సౌకర్యాలను మెరుగుపరచి పూర్తి చేయడం జరుగుతుంది.
ప్రణాళిక ప్రకారం ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా అనవసర నిర్మాణాలను తొలగించడం ద్వారా రైల్వే స్టేషన్లకు సాఫీగా యాక్సెసింగ్, మెరుగైన లైటింగ్, అప్‌గ్రేడ్ చేసిన పార్కింగ్ స్థలం, దివ్యాంగులకు అనుకూలమైన మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ద.మ.రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మీడియాతో మాట్లాడుతూ జోన్ పరిధిలో చేపట్టనున్న అమృత్ భారత్ స్టేషన్లు రైలు వినియోగదారులకు నూతన అనుభూతిని ఇస్తాయని తెలిపారు.
ఆధునిక ఆర్కిటెక్చర్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయబడిన ఈ స్టేషన్లు దీర్ఘకాలిక ప్రణాళికపై దృష్టి సారించి నగర కేంద్రాలుగా పనిచేస్తాయని తెలిపారు. ఈ స్టేషన్ల అభివృద్ధి ప్రాధాన్యత కింద చేపట్టి ఈ పనులు ప్రతి దశను సకాలంలో పూర్తి చేయడానికి నిశితంగా పర్యవేక్షించనున్నట్లు ఈ సందర్భంగా జైన్ స్పష్టం చేశారు.