Tuesday, November 26, 2024

Big Story | గ్రామాల్లో రీ సైక్లింగ్‌ రోడ్లు.. అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కో రీసైక్లింగ్‌ యూనిట్‌ ఏర్పాటు

అమరావతి, ఆంధ్రప్రభ: గ్రామాల్లో సిమెంట్‌, తారు రోడ్లను మాత్రమే ఇప్పటివరకు చూశాం. ఇకపై ప్లాస్టిక్‌ రోడ్లనూ చూడబోతున్నాం. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగంపై నిషేధం విధించిన సర్కార్‌ ప్లాస్టిక్‌ వ్యర్థాల రీసైక్లింగ్‌పైనా ప్రత్యేక దృష్టి సారించింది. వాడి పారేసిన ప్లాస్టిక్‌ వ్యర్థాలకు అర్థాన్ని.. ప్రయోజనాన్ని చేకూర్చేలా ప్లాస్టిక్‌ రోడ్ల నిర్మాణానికి అనువుగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. సిమెంట్‌ పరిశ్రమల్లో వినియోగించే విధంగానూ రీసైక్లింగ్‌ యూనిట్లను సిద్ధం చేస్తోంది. పర్యావరణంతో పాటు భూగర్భ జలాలకు ప్రమాదకరంగా తయారైన ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఎప్పటికప్పుడు సేకరించి.. వాటిని రోడ్ల నిర్మాణంలో ఉపయోగించేలా రీసైక్లింగ్‌ చేసేందుకు పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది.

నియోజకవర్గానికి ఒకచోట ఈ తరహా రీసైక్లింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా 160 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు గ్రామాల ఎంపిక సైతం పూర్తయింది. పట్టణాల తరహాలో గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రతి ఇంటినుంచీ నేరుగా చెత్త సేకరణ ప్రక్రియను ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇలా సేకరించిన చెత్తను ఆయా గ్రామాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న చెత్త సేకరణ కేంద్రాల (సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ షె)లో ప్లాసిక్‌ వ్యర్థాలను ఎప్పటికప్పుడు వేరు చేసి ఉంచుతారు.

- Advertisement -

గ్రామాల వారీగా ఇలా వేరు చేసిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను వారానికి ఒకటి లేదా రెండు విడతలుగా ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌కు తరలించేలా ఒక వాహనాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ప్రతివారం రూట్ల వారీగా ఆ వాహనంతో అన్ని గ్రామాల నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్‌ యూనిట్లకు తరలిస్తారు. అనంతరం ప్లాస్టిక్‌ బాటిళ్లు, ఇతర ప్లాస్టిక్‌ వ్యర్థాలను మెషిన్ల సాయంతో బండిల్స్‌ రూపంలో అణచివేసి.. ఆ తర్వాత చిన్నచిన్న ముక్కలు ముక్కలుగా మార్చి నిల్వ చేస్తారు.

రోడ్ల నిర్మాణంలో వినియోగించేలా..

ప్లాస్టిక్‌ బాటిల్స్‌ వంటివి మట్టిలో కలవడానికి కనీసం 240 సంవత్సరాలు పడుతుంది. ఇలాంటి ప్లాస్టిక్‌ వ్యర్థాలు వర్షం నీటిని భూమిలో ఇంకిపోకుండా అడ్డుపడుతుంటాయి. దీనివల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో పీఎంజీఎ (గ్రామీణ సడక్‌ యోజ) కింద చేపట్టే రోడ్ల నిర్మాణంలో కంకరతో పాటు కొంతమేర ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్రకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్లాస్టిక్‌ కవర్లు వంటి వాటిని సిమెంట్‌ పరిశ్రమలలో మండించడానికి ఉపయోగించేలా ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి.

ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే రీసైక్లింగ్‌ యూనిట్లలో సిద్ధం చేసిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను రోడ్ల నిర్మాణంలో ఉపయోగించాల్సి ఉంటుంది. రీసైక్లింగ్‌ యూనిట్ల ద్వారా రోడ్డ నిర్మించే కాంట్రాక్టర్లకు ఎక్కడికక్కడ ప్లాస్టిక్‌ వ్యర్థాలను విక్రయించే ఆలోచన చేస్తున్నారు. రానున్న రోజుల్లో రోడ్ల నిర్మాణంలో వీటి వాడకం పెరిగే పక్షంలో జిల్లాల వారీగా ప్రత్యేక వేలం కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

ఇప్పటికే 300 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాల సేకరణ

పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా 2021 అక్టోబర్‌ నుంచి క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ నినాదంతో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 300 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించారు. వాటిలో స్థానికంగా అమ్మడానికి వీలున్న వాటిని గ్రామ పంచాయతీల స్థాయిలోనే చిరు వ్యాపారులకు అమ్మేశారు. అమ్మకానికి పనికి రాని ప్లాస్టిక్‌ వ్యర్థాలను పర్యావరణానికి హాని కలిగించని రీతిలో నాశనం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి గ్రామాల్లొ సేకరించే ప్లాస్టిక్‌ వ్యర్థాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న రీసైక్లింగ్‌ యూనిట్ల ద్వారా రోడ్ల నిర్మాణం లేదా సిమెంట్‌ పరిశ్రమలో మండించడానికి ఉపయోగించేలా రీసైక్లింగ్‌ ప్రాసెస్‌ చేయనున్నట్టు- పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement