Saturday, November 23, 2024

ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ! పెద్ద సంఖ్యలో డ్రైవర్‌, కండక్టర్‌ పోస్టులు.. ఫేక్‌ సమాచారం అంటున్న అధికారులు

అమరావతి, ఆంధ్రప్రభ: ‘ఆర్టీసీ ఉద్యోగం గతంలోలా కాదు..ఇప్పుడు ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. ఒక్కసారి అందులో చేరితే ఇక జీవితానికి ఢోకా ఉండదు’ అంటూ కేటుగాళ్లు నిరుద్యోగులకు వల విసురుతున్నారు. గతంలో హోంగార్డు..హైకోర్టు.. మార్కెటింగ్‌ శాఖల్లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను నిండా ముంచిన వారి చూపు ఇప్పుడు ఆర్టీసీపై పడింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో..వారు ఇప్పుడు ఆ వైపు దృష్టిసారించారు. ఆర్టీసీలో డ్రైవర్‌, కండక్టర్‌ ఉద్యోగాలు అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులను వైరల్‌ చేస్తున్నారు. ఇప్పటికే పలు సామాజిక మాధ్యమాల్లో ఆర్టీసీ ఉద్యోగాలంటూ పోస్టులు విస్తృతంగా చెలామణి అవుతున్నాయి. కొందరు వాట్సప్‌ డీపీగా కూడా పెట్టుకుంటున్నట్లు తెలిసింది. ఆర్టీసీలో ఉద్యోగాలకు అధికారిక ప్రకటన అంటూ ఏమీ రాలేదు. నిజంగా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వపరంగా నోటిఫికేషన్‌ జారీ అవుతుంది.

ఇదేమీ లేకుండానే ఖాళీల సంఖ్యను కూడా పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాస్తో, కూస్తో అవగాహన ఉన్న వారు వాటి వివరాలు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుంటుంటే..ఉద్యోగం ఆశతో ఉన్న కొందరు మాత్రం పోస్టులు పెడుతున్న వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆర్టీసీలో 3,964 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కొందరు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో డ్రైవర్‌ పోస్టులు 1,950, కండక్టర్‌ పోస్టులు 2,014 ఉన్నట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలంటూ చెపుతున్న వీరు ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ చెపుతున్నారు. ఏపీ పరిధిలో పని చేయాల్సి ఉంటుందని పేర్కొంటూ 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయస్కులు అర్హులని, డిసెంబర్‌ 29వ తేదీ చివరి రోజుగా గడువు కూడా పెట్టారు.

- Advertisement -

అందులో ఆర్టీసీ రిక్రూట్‌మెంట్‌ 2022 పూర్తి సమాచారం అంటూ కింద ఏ విధమైన వెబ్‌సైట్‌ పేర్కొనకుండా సమాచారం షేర్‌ చేస్తున్నారు. అప్పుడు ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న వారు ఖచ్చితంగా పోస్టు షేర్‌ చేసిన వారిని సంప్రదించాలనే ఆలోచన కనిపిస్తోందని చెప్పొచ్చు. లేని ఖాళీలు ఉన్నట్లు చెపుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం ద్వారా భారీ కుట్రకు కొన్ని ముఠాలు తెరలేపాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీలో ఖాళీల భర్తీ లేదు. పలువురు పదవీ విరమణ చేసినా ఆర్టీసీ కార్పోరేషన్‌ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సింగల్‌ క్రూ(అదనపు విధులు) విధానంలో బస్సులు నడుపుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2020 జనవరిలో ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది. రాష్ట్ర రవాణాశాఖ పరిధిలో కొత్తగా పీటీడీ(పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్‌) విభాగాన్ని ఏర్పాటు చేసి ఆర్టీసీలో ఉద్యోగులను డెప్యుటేషన్‌పై విధులు అప్పగించారు. ఒకవేళ ఖాళీలు ఉంటే రెండు శాఖల్లోని అదనపు సిబ్బందిని సర్థుబాటు చేస్తున్నారు తప్ప కొత్తగా ఖాళీల భర్తీ అనేది లేదు. ఇప్పటికే పలువురు డ్రైవర్లను ఔటు సోర్సింగ్‌ విధానంలో తీసుకొని బస్సులు నడుపుతున్నారు.

కొన్ని అద్దె బస్సులు కూడా ఉన్నాయి. వాటి సిబ్బంది నియామకం అనేది యజమానికి సంబంధించిన అంశం. టిమ్స్‌(టిక్కెట్‌ ఇష్యూయింగ్‌ మెషిన్‌) రాకతో కండక్టర్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఒక వేళ ఖాళీలు భర్తీ చేయాలంటే ప్రభుత్వపరంగా అధికారిక నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. అంతే తప్ప సామాజిక మాధ్యమాల్లో ఖాళీలు అంటూ పోస్టింగ్‌లు పెట్టరు. ఇలాంటి స్థితిలో ఉద్యోగాల పేరిట ప్రచారం చేయడం అంటే వంచించడమేనని అధికారులు చెపుతున్నారు.

ఫేక్‌ సమాచారం..

ఆర్టీసీలో ఉద్యోగాల పేరిట జరుగుతున్న ప్రచారం నకిలీ అంటూ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) కేఎస్‌ బ్రహ్మానంద రెడ్డి స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌ల అంశాన్ని ఆంధ్రప్రభ ప్రతినిధి ఆయన దృష్టికి తీసుకెళ్లగా పై విధంగా స్పందించారు. అధికారులు నకిలీదిగా స్పష్టం చేసిన నేపధ్యంలో ఉద్యోగాలు అంటూ చెప్పే వారి పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్టీసీ, పోలీసు అధికారులు కూడా ఈ తరహా పోస్టులు చెలామణి చేసే వారిపై దృష్టిసారించి కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు మోసపోయే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement