హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖలోని స్త్రీ, శిశుసంక్షేమ శాఖ అధికారి పోస్టుల భర్తీ నియామక పరీక్షను టీఎస్పీఎస్సీ రేపు (మంగళవారం) నిర్వహించనుంది. ఈ పరీక్షను రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 75 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కంప్యూటర్ ఆధారిత ద్వారా పరీక్షను నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. మొత్తం 19,812 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 13,954 మంది అభ్యర్థులు సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిపింది.
అభ్యర్థులు రెండు పేపర్లను రాయాల్సి ఉంటుంది. పేపర్1..ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, పేపర్2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. అయితే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లో ఉదయం 8.30 గంటల నుంచి 9.15 వరకు అనుమతిస్తారని పేర్కొంది. మధ్యాహ్నం సెషన్‌కు 1.15 నుంచి 1.45 లోనికి అనుమతివ్వనున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు తమ వెంట హాల్‌టికెట్, ఐడీ కార్డు తీసుకెళ్లాలని సూచించింది. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను లోనికి అనుమతించబోమని తెలిపింది.