ప్రస్తుత ఖరీఫ్‌లో వరి దిగుబడిలో తెలంగాణా రికార్డు సృష్టించడంపై రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సారి 66.77 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని రాష్ట్ర రైతులు సాధించారని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ప్రస్తుత తెలంగాణలోనూ ఈస్థాయిలో దిగుబడి మొదటిసారి అని చెప్పారు.
ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. యావత్ భారత దేశంలోనే ఇంతటి వరి దిగుబడి అరుదైన రికార్డు అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మూడు బ్యారేజీలు పని చేయక పోయినా వరి దిగుబడిలో అద్భుతమైన విజయాన్ని రాష్ట్రం సాధించిందని, ఇది ముమ్మాటికీ రాష్ట్ర రైతుల విజయమని పేర్కొన్నారు.