Monday, November 18, 2024

టీఎస్‌ఆర్టీసీ చరిత్రలో ఆల్‌ టైం రికార్డు.. రాఖీ పౌర్ణమి రోజు రూ.22.65 కోట్ల ఆదాయం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాఖీ పౌర్ణమి పర్వదినం రోజు టీఎస్‌ఆర్టీసీ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. గురువారం ఒక్క రోజే సంస్థ రూ.22.65 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్‌ టైం రికార్డు. గత ఏడాది రాఖీ పండుగ సందర్భంగా సంస్థకు రూ.21.66 కోట్ల ఆదాయం సమకూరగా, ఈ సారి దాదాపు రూ.కోటి వరకూ అదనంగా ఆర్జించింది. ఈ రాఖీ పౌర్ణమి రోజు రికార్డు స్థాయిలో 40.92 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. గత ఏడాది కన్నా లక్ష మంది అదనంగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు.

ఒక్క రోజులో ఇంత పెద్ద ఎత్త్తున ప్రయాణించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే, గత రాఖీ పండుగతో పోలిస్తే ఆర్టీసీ అదనంగా 1.23 లక్షల కి.మీ.ల మేర బస్సులను నడిపింది. కాగా, ఈసారి రాఖీ పండగ సందర్భంగా ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) విషయానికి వస్తే…ఉమ్మడి నల్లగొండ జిల్లా గత ఏడాది రికార్డును పునరావృతం చేసింది. గత ఏడాది రాఖీ పండుగ నాడు 101.01 ఓఆర్‌ సాధించగా, ఈసారి 104.68 శాతం రికార్డు స్థాయి ఓఆర్‌ను నమోదు చేసింది. ఆ జిల్లా పరిధిలోని 7 డిపోల్లో నార్కట్‌పల్లి మినహా మిగతా డిపోలన్నీ 100 శాతానికి పైగా ఓఆర్‌ సాధించాయి.

- Advertisement -

నల్లగొండ తరువాత ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 97.05 శాతం ఓఆర్‌ నమోదైంది. ఆ జిల్లాలో మొత్తం 9 ఆర్టీసీ డిపోలు ఉండగా, 6 డిపోలు 100కు పైగా ఓఆర్‌ సాధించడం విశేషం. అలాగే, ఉమ్మడి మెదక్‌, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ జిల్లాల్లో 90 శాతానికి పైగా ఓఆర్‌ నమోదైంది. మరోవైపు, రాఖీ పౌర్ణమి రోజు రాష్ట్రంలోని 20 డిపోల్లో ఓఆర్‌ 100 శాతానికి పైగా దాటింది. ఆయా డిపోల్లో బస్సులన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి.

100 శాతానికి పైగా ఓఆర్‌ సాధించిన డిపోల్లో హుజూరాబాద్‌, నల్లగొండ, భూపాలపల్లి, హుస్నాబాద్‌, పరకాల, కల్వకుర్తి, తొర్రూర్‌, మహబూబాబాద్‌, మిర్యాలగూడ, దేవరకొండ, యాదగిరిగుట్ట, గజ్వేల్‌, ప్రజ్ఞాపూర్‌, కోదాడ, నర్సంపేట, సూర్యాపేట, దుబ్బాక, జనగామ, సిద్దిపేట, గోదావరిఖని, షాద్‌నగర్‌ డిపోలు 100 శాతానికి పైగా ఓఆర్‌ సాధించాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో అత్యధికంగా కి.మీ.కు రూ.65.94ను వరంగల్‌ డిపో, ఆ తరువాత రూ.65.64ను భూపాలపల్లి డిపో సాధించింది. ఈ రెండు డిపోలు సైతం సంస్థ చరిత్రలోనూ ఎర్నింగ్స్‌ పర్‌ కి.మీ. ఆల్‌ టైం రికార్డు సాధించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement