తమ పెళ్లిని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద చట్టబద్ధంగా గుర్తించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన ‘గే’ దంపతులు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తమ పెళ్లిని గుర్తించడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. తమకు ఇష్టమైన వారిని పెళ్లి చేసుకునే హక్కును రాజ్యాంగం పౌరులకు కల్పించినట్టే, ఆ హక్కు తమకూ వర్తిస్తుందని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసిన విషయాన్ని పిటిషన్‌లో పేర్కొన్నారు. సేమ్ సెక్స్ మ్యారేజ్‌ను గుర్తించకపోవడం అంటే అది సమానత్వ హక్కును ఉల్లంఘించడమే అవుతుందన్నారు.
ప్రత్యేక వివాహం చట్టం కింద సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకున్న జంటలకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని పలు జంటలు సుప్రీంలో దాఖలైన పిటిషన్లపై శుక్రవారంనాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. స్వలింప సంపర్కుల వివాహాలపై తమ అభిప్రాయం వెల్లడించాలని కేంద్రానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది.