న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ (టీఆర్ఎస్‌పీపీ) పేరును భారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ(బీఆర్ఎస్‌పీపీ)గా మార్చాలని ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభాపతులకు వినతి పత్రాలు అందజేశారు. శుక్రవారం పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు నివాసం నుంచి ఎంపీలు పార్లమెంటుకు వెళ్లి రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్కడ్‌ను కలిశారు. తమ పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చుకోడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అనుమతినిచ్చిందని తెలియజేశారు. ఈ క్రమంలో పార్లమెంటరీ పార్టీ పేరును కూడా మార్చాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేకే నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఎంపీలు ఇక నుంచి పార్లమెంటులోనూ టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా వ్యవహరించనున్నట్టు కేశవ రావు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం తరహాలోనే దేశమంతటా ప్రజలు సంతోషంగా ఉండేలా పాలన అందించడం కోసమే తమ పార్టీ అధినేత పార్టీని బీఆర్ఎస్‌గా మార్చారని, సామాజిక న్యాయం, సర్వతోముఖాభివృద్ధి అజెండాగా ముందుకెళ్తున్నామని తెలిపారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ గురించి కేసీఆర్ త్వరలోనే ప్రకటిస్తారని ఆయనన్నారు.
పార్టీ లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వర రావు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతు వ్యతిరేకి అని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం నిధుల విషయంలో వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఇదొక్కటే కాదు, అన్ని విషయాల్లోనూ కేంద్రం రైతులకు వ్యతిరేకంగా, తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. తాజాగా బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అన్నారు. దేశంలోనే ఫార్మా రంగానికి కేంద్ర బిందువులా ఉన్న హైదరాబాద్ నగరంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రం దరఖాస్తు చేసినప్పటికీ తమకు ఇవ్వకుండా మరో రాష్ట్రానికి ఇచ్చారని నామ అన్నారు. ఇదే విషయంపై పార్లమెంటులో అడిగితే తెలంగాణకు ఇచ్చామంటూ కేంద్ర మంత్రి బుకాయించారని, ఆ తర్వాత పొరపాటు జరిగిందంటూ లేఖ రాసి క్షమాపణలు కోరారని చెప్పారు.