Monday, November 25, 2024

Real Friend – స్నేహితుడి చితిపైనే స‌జీవ‌ద‌హ‌నం…

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ – వారిద్దరూ ప్రాణ స్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగారు. కలిసే పెరిగారు. ఒకరంటే మరొకరికి ప్రాణం. అందుకే ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. అనారోగ్యంతో స్నేహితుడి చనిపోతే మరో స్నేహితుడు తట్టుకోలేకపోయాడు. అంత్యక్రియలు నిర్వహించి అందరూ ఇంటికి వెళ్లిపోతుండగా ఆ స్నేహితుడు మాత్రం అక్కడే ఉండి, చితిలో దూకాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ జిల్లా నాగ్లా ఖంగార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే 42 ఏళ్ల అశోక్, 40 ఏళ్ల ఆనంద్ స్నేహితులు. అయితే కొంత కాలం కిందట అశోక్ కు క్యాన్సర్ సోకింది. దానికి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నా.. పరిస్థితి విషమించడంతో అతడు శనివారం ఉదయం మరణించాడు. దీంతో స్థానికంగా ఉన్న యమునా నది ఒడ్డున అశోక్ మృతదేహానికి కుటుంబ సభ్యులు, బంధువులు అదే రోజు ఉదయం 11 గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహించారు.


ఆ సమయంలో అతడి స్నేహితుడు ఆనంద్ అక్కడే ఉన్నాడు. స్నేహితుడి మృతిని అతడు తట్టుకోలేకపోయాడు. అంత్యక్రియలకు హాజరైన వారందరూ శ్మశాన వాటిక నుంచి బయటకు వెళ్లడం మొదలు పెట్టగానే ఆనంద్ అకస్మాత్తుగా చితిలోకి దూకాడు. దీనిని గమనించిన ప్రజలందరూ వెంటనే చితి వద్దకు పరిగెత్తుకొచ్చారు. ఆనంద్ ను చితి నుంచి బయటకు లాగేందుకు ప్రయత్నించారు.
చివరికి అతడిని చితి నుంచి బయటకు తీశారు. కానీ తీవ్ర గాయాలవడంతో వెంటనే జిల్లా హాస్పిటల్ కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఆగ్రా మెడికల్ కాలేజీకి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. కానీ అక్కడికి తరలిస్తున్న సమయంలోనే పరిస్థితి విషమించడంతో ఆనంద్ మరణించాడు. ఒక రోజు ఇద్దరు స్నేహితులు చనిపోవడంతో ఆ గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement