ఉమ్మడిరంగారెడ్డి, ప్రభ న్యూస్ : హైదరాబాద్ మహానగరం చుట్టూరా రంగారెడ్డి, మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాలు విస్తరించి ఉన్నాయి. శివారు మండలాలు దాదాపుగా హైదరాబాద్‌లో కలిసిపోయాయి. శివార్లలో వ్యవసాయేతర భూముల క్రయావిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుండటంతో ప్రతిరోజు వేలాది డాక్యుమెంట్లు నమోదవుతున్నాయి. వ్యవసాయ భూముల క్రయావిక్రయాలు సబ్ రిజిస్టార్ కార్యాలయాలనుండి తొలగించారు. వాటిని తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఐనా ఆదాయాన్ని సమకూర్చి పెట్టుటలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ప్రతిసారి ఉమ్మడి జిల్లానే ముందు వరుసలో నిలబడుతుంది. కరోనా నేపథ్యంలో కొంతమేర ఇబ్బందులు ఉన్నా దండిగా ఆదాయం సమకూరింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 5,500కోట్లమేర ఆదాయం సమకూరింది. ఇందులో రూ. 3513కోట్లు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నుండే సమకూరింది. ఈ జిల్లాల పరిధిలో 2.57లక్షల డాక్యుమెంట్లు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 1987కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఈ జిల్లా పరిధిలో 1.60లక్షల మేర డాక్యుమెంట్లు నమోదయ్యాయి.
ప్రతి ఏటా పెరుగుతున్న ఆదాయం….
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పెరుగుతోంది. గతఏడాదితో పోలిస్తే వెయ్యి కోట్లకు పైగానే ఆదనంగా ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రంగారెడ్డి జిల్లాలో రూ. 2813కోట్లమేర ఆదాయం రాగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 3513కోట్లమేర ఆదాయం వచ్చింది. మధ్యమధ్యలో కరోనా నేపథ్యంలో కొంతమేర బ్రేక్ జరిగినా క్రయావిక్రయాలు మాత్రం ఆగలేదు. హైదరాబాద్ చుట్టూరా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విస్తరించి ఉంది. దీంతో ఈ ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆలస్యం చేస్తే ధరలు మరింతగా పెరిగిపోయే ప్రమాదం ఉందని చాలామంది ఆలస్యం చేయకుండా కొనుగోలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలనుండే కాకుండా ఇతర ప్రాంతాల వాళ్లు కూడా కొనుగోలు చేసేందుకు పోటీపడుతున్నారు. ఐటీ కంపనీలు రికార్డు స్థాయిలో ఏర్పాటవుతున్నాయి. ఒకప్పుడు బెంగుళూరు వైపు చూసే ఐటీ కంపనీలు నేడు హైదరాబాద్ చుట్టూరా ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసే వాళ్లు విల్లాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెద్దపెద్ద అపార్టుమెంట్లు ఏర్పాటవుతున్నాయి. కోట్లాది రూపాయలు కర్చు చేసి కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. రోజురోజుకు ధరలు పెరిగిపోతుండటంతో ఆలస్యం చేయకుండా కొనుగోలు చేస్తున్నారు…
శివార్లలో రికార్డు స్థాయిలో అమ్మకాలు…
రంగారెడ్డి, మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలో రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది.ముఖ్యంగా మార్కెట్ ఎక్కువగా శివారు ప్రాంతాల్లో కొనసాగుతోంది. శివార్లలో క్రయావిక్రయాల జోరు కొనసాగుతుండటంతో ఏడాదిలో రెండుసార్లు ప్రభుత్వం మార్కెట్ విలువలు పెంచింది. శివార్లలో గతంలో ఉన్న మార్కెట్ విలువను 100శాతం అదనంగా పెంచింది. ఐనా క్రయావిక్రయాలు ఎక్కడా కూడా ఆగడం లేదు. క్రయావిక్రయాల్లో గండిపేట మండలం జోష్ మీదుంది. ఈ ప్రాంతాల్లో క్రయావిక్రయాలు జరుగుతున్నంత మరే ఇతర ప్రాంతాల్లో జరగడం లేదు. బండ్లగూడ, హైదర్‌షావ్‌కోట్ల, కిస్మత్‌పూర్, మంచిరేవుల, పీరం చెరువు, నార్సింగి, గండిపేట, కోకాపేట, పుప్పాల్‌గూడ, మణికొండ, ఖానాపూర్ ప్రాంతాల్లో క్రయావిక్రయాల జోరు కొనసాగుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ మండలంలోనే ఎక్కువ ఆదాయం సమకూరింది. ఈ మండలం పరిధిలో ఏకంగా 48.09 కోట్లమేర ఆదాయం సమకూరింది. జంట జిల్లాల పరిధిలో ఇక్కడే ఎక్కువ క్రయావిక్రయాలు జరిగాయి. తరువాతి స్థానంలో మహేశ్వరం నిలిచింది. ఇక్కడ ఏకంగా రూ. 17.81కోట్లమేర ఆదాయం వచ్చింది. శేరిలింగంపల్లిలో రూ. 8.49కోట్లు, ఉప్పల్‌లో రూ. 8.21కోట్లు, మేడ్చల్‌లో రూ. 8.08కోట్లు, కుత్బుల్లాపూర్‌లో రూ. 7.51కోట్లమేర ఆదాయం సమకూరింది. క్రయావిక్రయాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వం భూముల విలువ దండిగా పెంచింది. ఐనా కొనుగోళ్లు ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు
ఆదాయంలో మిన్నా…సౌకర్యాల్లో సున్నా….
ప్రతిఏటా వేలాది కోట్ల ఆదాయాన్ని సమకూర్చిపెడుతున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సౌకర్యాల విషయంలో వెనకబడి ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 31 సబ్ రిజిస్టార్ కార్యాలయాలున్నాయి. జిల్లా రిజిస్టార్ కార్యాలయాలు కూడా సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లోనే కొనసాగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సగానికి పైగా కార్యాలయాలు అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాల మధ్య కొనసాగుతున్నాయి. ప్రజలకు అందుబాటులో కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అరకొర సౌకర్యాలున్నా ప్రజలకు అందుబాటులో ఉండటంతో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. సొంత భవనాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఎప్పటినుండో ఉన్నాయి. ఐనా అడుగు ముందుకు పడటం లేదు. అనుకూలమైన భూములు ఇస్తే భవనాలు నిర్మించే అవకాశం ఉంటుంది. గతంలో భవనాల నిర్మాణాలకు కొంతమేర ప్రయత్నం చేసినా పూర్తి స్థాయిలో విజయం సాధించలేని పరిస్థితులు నెలకొన్నాయి. దండిగా ఆదాయాన్ని సమకూర్చిపెడుతున్న ఉమ్మడి జిల్లాకు మొదటి ప్రాధాన్యం కింద సొంత భవనాలు నిర్మించి ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. అదిగో ఇదిగో అంటూ ఉన్నతాధికారులు హడావుడి చేయడం తరువాత మరిచిపోవడం పరిపాటిగా మారింది. రిజిస్ట్రేషన్ల కోసం వెళ్లిన వాళ్లు కూర్చునేందుకు కూడా సరియైన వసతులు లేవంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ చూపి సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..