హైదరాబాద్, ఆంధ్రప్రభ: రియల్ ఆదాయ వృద్ధిలో తెలంగాణ నంబర్ 1గా నిలుస్తోంది. స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ఆదాయంలో దేశంలోనే తొలి స్థానంలో తెలంగాణ చోటు సాధించింది. 2021తో పోలిస్తే 2022లో స్టాంపు డ్యూటీలు, రిజిస్ట్రేషన్ల చార్జీల వసూళ్లలో 136శాతం వృద్ధి రేటుతో దూసుకుపోయింది. జాతీయ సగటుకంటే తెలంగాణ వృద్ధి సగటు నాలుగు రెట్లు ఎక్కువగా నమోదు చేసుకుంది. దేశంలోని 27రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో పోలిస్తే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో వచ్చిన ఆదాయంలో తెలంగాణ ముందు వరుసలో నిల్చింది. దేశంలోని 27రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో 2021లో రూ.1,27,754 కోట్ల స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల రుసుముల ఆదాయం 2022లో 84శాతం వృద్ధితో రూ.1,71,150 కోట్లకు పెరిగింది. ఇందులో తెలంగాణ 136శాతం వృద్ధిరేటుతో తొలి స్థానం కైవసం చేసుకుంది. 2021లో రూ.5243 కోట్ల రాబడి నుంచి 2022లో రూ.12,372 కోట్లకు ఎదిగింది. ప్రతికూలతలను అధిగమిస్తూ తెలంగాణ రియల్ రంగం వృద్ధికి చేరువవుతున్నది. గతేడాదితో పోలిస్తే హైదరాబాద్‌లో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు 152శాతం పెరిగాయి. మే నెలలో 6301గా నమోదుకాగా, ఏప్రిల్‌కంటే 17.6శాతం పెరుగుదల సొంతమైంది. ఇండ్ల ధరలను గమనిస్తే రూ.25 లక్షలు రూ.50 లక్షల శ్రేణిలో ఎక్కువ ఆదరణ కనిపిస్తోంది. మే నెలలో ఈ ధరల్లోని నివాస గృహాలు 55శాతంగా అమ్ముడయ్యాయి. రూ.25 లక్షల్లోపు ఇండ్లకు డిమాండ్ 18శాతం పడిపోయింది. రూ.50 లక్షల పైబడిన ఇండ్ల విక్రయాల్లో 27శాతం పెరిగింది.
ఇలా హైదరాబాద్‌లో మే 2021లో 13శాతం ఉండగా, మే 2022కు 11శాతంగా, మేడ్చల్ మల్కాజ్గిరి గతేడాది 38శాతం నుంచి ఈ ఏడాది 51శాతానికి, సంగారెడ్డి గతేడాది 5శాతం నుంచి ఈ ఏడాది 3శాతంగా నమోదయ్యాయి. గడచిన రెండేళ్లుగా రాష్ట్రంలో భూములకు భూమ్ వస్తోంది. రాష్ట్రంలో ఏ మూల చూసినా హైదరాబాద్ తరహా ధరలతో రియల్ రంగం కళకళలాడుతోంది. మౌలిక వసతుల కల్పనలో అద్భుత విజయం సొంతం చేసుకోవడంతో హైదరాబాద్‌తోపాటు ద్వితీయ శ్రేణి నగరాలు, జిల్లా కేంద్రాలు, పట్టణాలు, మునిసిపాలిటీలలో రియల్ రంగంలోకి లక్షల కోట్లను పారిస్తున్నాయి. రాష్ట్రమంతటా ఇరిగేషన్ ప్రాజెక్టుల రాకతో పడావు భూములన్నీ వ్యవసాయ భూములుగా రూపాంతరం చెందగా, హైదరాబాద్ చుట్టూ ఉన్న శివారు జిల్లాల్లో రియల్ ఎస్టేట్ సుభిక్షంగా వర్ధిల్లుతున్నది. రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రాజెక్టుల రాకతోపాటు, ప్రైవేటు రంగంలో పెద్దపెద్ద సంస్థలు పెట్టుబడులు పెడుతుండటం కూడా తెలంగాణకు కలిసి వస్తున్నది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ జరిగిన అభివృద్ధి ఇప్పుడు తెలంగాణలోని సగభాగంలో జరుగుతోంది. రీజినల్ రింగ్‌రోడ్డు భూ సేకరణ కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో సగానికి పైగా జిల్లాల్లో ఇప్పుడు రియల్ రంగం జోరుమీద సాగుతోంది. ఇండస్ట్రీయల్ పార్కులు, ఏరోస్పేస్ రంగం, సెజ్‌లు, నివ్జ్‌ు, ఫ్యాబ్ సిటీ, ఫార్మాసిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు వంటివి విస్తరింగా, వరంగల్ లాంటి నగరాల్లో ఐటీ పరిశ్రమ వేళ్లూనుకుంటోంది.
శివార్లలోనూ…
ఆస్పత్రులు, విద్యాసంస్థలు, ఐటీ హబ్‌లు, ఆకాశహర్మ్యాలు, అంతర్జా తీయ ఐటీ సెంటర్లు, ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీ లు, సూపర్ మార్కెట్లు, మాల్స్, మల్టి ఫ్లెక్సులు ఇలా శివారు ప్రాంతాలను చుట్టేస్తున్నాయి. నగరంలోనే కాకుండా చుట్టూ శివార్లలో మౌలిక వసతులు మెరుగుపడి, సోసల్ ఇన్ప్రా అందుబా టులోకి రావడంతో రియల్ రంగానికి మంచిరోజులొచ్చాయి. దేశంలోని ఇతర నగరాలకంటే హైదరాబాద్, దాని చుట్టు పక్కలి ప్రాంతాలు ఈ ట్రెండ్‌కు మజిలీగా మారాయి. నగరంలో భూములు అందుబా టులో లేకపోవడంతో నిర్మాణదారులు ఎక్కువగా శివార్లవైపు దృష్టి సారించారు. ఎకరాల విస్తీర్ణాల్లో గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువగా చేపడుతున్నారు. కొవిడ్‌తో వచ్చిన మార్పులతో ఇంటి నుంచే పనితో శివార్లకు డిమాండ్ పెరిగింది. ఔటర్ చుట్టూ, ఔటర్ వెలుపల రియల్ రంగం విస్తరించగా, అన్ని జిల్లా కేంద్రాల్లో ఊహించని స్థాయికి చేరింది.59శాతం శివార్లలో ఇండ్లకు డిమాండ్ ఉందని ఒక సర్వేలో వెల్లడైంది. 59శాతం మంది డబుల్ బెడ్రూం ఇండ్లకు మొగ్గు చూపుతున్నారని తేలింది. 17శాతం మంది మూడు పడక గదుల ఇండ్లకు ప్రాధాన్యతనిస్తున్నారని గుర్తించారు. కొవిడ్ అనంతర పరిస్థితులతో తెలంగాణలో రియల్ రంగం ఊపందుకుంటోంది. ఇండ్లు, ప్రాజెక్టులు, ఆఫీస్ స్పేస్, భూముల లే అవుట్లలో అగ్రగామిగా ఎదుగొందుతోంది. అనేక దిగ్గజ సంస్థలు తమ సర్వేల్లో హైదరాబాద్ ఖ్యాతి, దశ, అభివృద్ధి ఫలాలను నివేదికల రూపంలో పేర్కొంటూ కీలక అంశాలు వెల్లడించాయి. ఇండ్ల అమ్మకాలు, అప్పులులేకుండా పెట్టుబడులు, రియల్ రంగంలో పరపతిలో ఇప్పుడు తెలంగాణ… ప్రత్యేకంగా హైదరాబాద్ దేశంలోనే ఎవరికీ అందనంత ఎత్తులో ఉందనేది అనేక సర్వేలు అభిప్రాయపడ్డాయి. తమ నివేదికల్లో హైదరాబాద్ ప్రత్యేకతను ప్రస్తావించాయి.
కరోనా దెబ్బకు దేశంలోని ప్రముఖ రియల్ సంస్థలు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ తెలంగాణలో పెద్దగా ఈ పరిస్థితి తలెత్తలేదు. ఇండ్ల అమ్మకాల్లో ప్రధానంగా హైదరాబాద్ దూసుకుపోతున్నది. దేశంలోని 8 ప్రధాన మెట్రో నగరాల్లో హైదరాబాద్ ముందువరుసలో నిలుస్తోంది. కూకట్పల్లి, నిజాంపేట్‌లలో రూ.50 లక్షల లోపు ఇండ్లకు డిమాండ్ ఉండగా, కొండాపూర్, మియాపూర్, కొంపల్లిలలో రూ.1కోటి వరకు విలువ ఉన్న ఇండ్లకు డిమాండ్ కనిపిస్తోంది. శివారు ప్రాంతాల్లో కూడా వెంచర్లకు మధ్యతరగతి ప్రజల నుంచి స్పందన కనిపిస్తున్నది. సాధారణ, దిగువ మధ్య తరగతి ప్రజలు ఔటర్ వెలుపల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారీ ప్రాజెక్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఔటర్‌కు 50కిలోమీటర్ల వరకు కూడా రహదారుల వెంట గేటెడ్ కమ్యూనిటీలు విస్తరిస్తున్నాయి. ఒక్కో ఇళ్లు రూ.25 నుంచి రూ.50 లక్షల వరకు లభిస్తోంది. హైదరాబాద్ చట్టూ పెరిగిన రవాణా సౌకర్యాలు, కాస్మోపాలిటన్ కల్చర్, మెట్రో, జాతీయ రహదారుల విస్తరణ, ఐటీ కారిడార్లు ఇప్పుడు ఆకర్షణీయంగా మారి దేశంలోనే తెలంగాణ ఇండ్ల విక్రయాల్లో ముందువరుసలో నిలబడుతోంది. అప్పులు తగ్గి, పెట్టుబడులు పెరిగి తెలంగాణ రియల్ రంగానికి పరపతి పెరిగింది. అయితే రాష్ట్రంలో మాత్రం ఇందుకు భిన్నంగా రుణ మొత్తాలు తగ్గినప్పటికీ రుణ పరపతి భారీగా పెరిగిందని పలు సంస్థలు సర్వేల్లో పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో భారీ వెంచర్లు పెరుగుతున్నాయని ఈ నివేదికలు పేర్కొన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.