హైదరాబాద్, ఆంధ్రప్రభ: సమైక్యపాలకుల నిర్లక్ష్యంతో బీడుబారిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవంతో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. బాబ్లి నిర్మాణంతో బీడుగా మారిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టును పునరుద్ధరించాల్సిన నాటి పాలకవర్గాలు ప్రాజెక్టును రాజకీయంచేసి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మధ్య వైరుద్ధ్యాలు సృష్టించి శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ఎండబెట్టారు. ఉత్తర తెలంగాణకు జీవధారగా ఉన్న శ్రీరాంసాగర్ బీటలు బారడంతో పునరుద్ధరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతీసుకుని శ్రీరాంసాగర్ రెండవదశ పనులను ప్రారంభించారు. 10ఆగస్టు 2017న ముప్కాల్ దగ్గర ప్రాజెక్టు పనులకు సీఎం కేసీఆర్ శంకు స్థాపన చేసి నిర్మాణ పనులకోసం ప్రాథమికంగా రూ.వేయి 67 కోట్లకు పరిపాలనా అనుతులు ఇచ్చారు.
ఆతర్వాత అంచనావ్యయాలు మారుతూ, పనుల్లో కాలువల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రస్తుతం రూ.19వేల 995 కోట్ల 56 లక్షల తో పనులు పూర్తి కావచ్చాయి. ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా నిలిచిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలక్రమంలో వట్టిపోయింది. 1963లో అప్పటి ప్రధాని నెహ్రూ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా 24 జూలై 1970లో నాటి ముఖ్యమంత్రి కాసుబ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ప్రాజెక్టును ప్రారంభించిన కొద్ది సంవత్సరాల్లోనే కాలువలు పూరుకు పోవడంతో పాటుగా ప్రాజెక్టు కట్టలు బలహీనమై పునరుద్ధరణకు నోచుకోలేదు. అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లి ప్రాజెక్టు నిర్మించడంతో శ్రీరాంసాగర్ కు రావల్సిన గోదావరి జలాలు బాబ్లిలో నిలిచి పోవడంతో క్రమేణ ప్రాజెక్టు బీటలు బారింది. తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన నాటి ఉద్యమ నేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో శ్రీరాంసాగర్‌ను పునరుద్ధరించి లక్షల ఎకరాల్లో గోదావరి జలాలను ప్రవహింపచేయనున్నట్లు ఇచ్చిన హామీని నేరవేరుస్తూ పనులు ప్రారంభించారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండవ దశ పునరుద్ధరణలో భాగంగా కాకతీయ కాలువ పొడవులో 284 కిలోమీటర్ల నుంచి 384 కిలోమీటర్ల వరకు విస్తరించి వరదకాలువలను పునరుద్ధరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కాకతీయ కాలువ లోకి కాళేశ్వరం నీటిని ఎత్తిపోస్తారు. జగిత్యాల మల్యాల మండలం రాంపూర్, జిగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్‌రావు పేట, నిజమాబాద్ జిల్లా ముప్కాల్ దగ్గర కాకతీయ కాలువల్లోకి కాళేశ్వరం నీటిని ఎత్తిపోసేందుకు మోటర్లను బిగించారు. ఈ నీరు శ్రీరాంసాగర్ చేరుకుని 34 కాలువల ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించనుంది. రోజుకు ఒక టీఎంసీ చొప్పున 60 రోజులు నీటిని ఎత్తిపోసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టును కాళేశ్వరం జలాలతో నింపి కాకతీయ కాలువల ద్వారా వ్యవసాయ క్షేత్రాలకు నీరు అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండవదశతో వరంగల్ రూరల్ లో 22వేల 422 ఎకరాలు, ఖమ్మం లో 75వేల 262 ఎకరాలు, సూర్యాపేటలో 2లక్షల 13వేల 175 ఎకరాలు, జనగామలో వేయి 108 ఎకరాలు, మహబూబాబాద్ లో 85వేల 982 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటుగా మరో మూడులక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటుగా భూగర్భజలాలు పెరిగి బోర్లకు నీరు అందుబాటులోకి రానుంది. కాళేశ్వరం నుంచి 100 కిలోమీటర్ల కాలువలతో 3దశల్లో ఎత్తిపోతలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీరు చేరుకుని 3లక్షల 97వేల 949 ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్రాజెక్టు సంబంధించి మూడు పంపుహౌజ్‌ల నిర్మాణం పూర్తి కావడంతో పాటు మట్టిపని, కాంక్రీట్ పని, ఎలక్ట్రికల్, సబ్ స్టేషన్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. అలాగే అప్రోచ్ రోడ్లు, అంతర్గత రోడ్లు, సరిహద్దు కట్టలు,కాలువల నిర్మాణ పనులు, సిబ్బంది ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.