హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఎన్నికల వేడి మొదలవుతోందన్న నేతల మాటల నడుమ సీఎం కేసీఆర్ మళ్లిd జిల్లాల టూర్‌కు రెడీ అవుతున్నారు. ఆయన జిల్లాల టూర్ షెడ్యూల్ ఖరారు కావడంతో అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త ఏడాదిలో మరో మూడు జిల్లాల్లో నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్లను ఆయన ప్రారంభించనున్నారు. ఈ నెల 12న మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌ను, అదేరోజు మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌ను, సంక్రాంతి పండుగ తర్వాత 18న ఖమ్మం జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు.
ఈ మేరకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. వికారాబాద్, మేడ్చేల్, పెద్దపల్లి, నిజామాబాద్, జగిత్యాలలో తాజాగా పర్యటనలు పూర్తి చేసుకుని పార్టీ కార్యాలయాలు, కలెక్టరేట్లను ప్రారంభించిన ఆయన ఈ మూడు జిల్లాల్లో కలెక్టరేట్ల బిల్డింగ్స్ ఓపెనింగ్స్‌కు రూట్‌మ్యాప్ రెడీ చేసుకున్నారు. తద్వారా ప్రజల్లోకి వెళ్లేలా ఆయన పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం దిశగా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. జిల్లాల అభివృద్ధిపై దృష్టిసారించిన ఆయన ఇప్పటికే దాదాపుగా అన్ని జిల్లాల కలెక్టరేట్లను పూర్తిచేసి ప్రాఈరంభోత్సవాలు చేశారు. ఇక ఎన్నికల ఏడాది కావడంతో ప్రత్యర్ధిపార్టీలకంటే ముందే ప్రజల్లోకి వెళ్లాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారని విశ్లేషకులు అంటున్నారు.
వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఇప్పటినుంచే ప్రజాక్షేత్రంలో యాక్టివ్‌గా పాల్గొనేలా జిల్లాల పర్యటనలు ఉండనున్నాయని అంటున్నారు. ప్రజల్లోకి వెళితేనే ప్రజల ఆలోచనా విధానం ఏవిధంగా ఉంది. వారేం కోరుకుంటున్నారు. పార్టీపై వ్యతిరేకత ఉందా…ఉంటే ఎలా సర్దుబాటు, సమన్వయం చేసుకోవాలి. ప్రజలను తమవైపు తిప్పుకోవడానికి ఏం చేయాలి..ప్రతిపక్షాల బలం, బలగం ఏమిటీ, ప్రతిపక్షాల విమర్శలకు ఏ విధంగా సమాధానం చెప్పాలి..పార్టీ బలోపేతానికి ఏం చేయాలి…సిట్టింగ్‌లపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది తదితర అంశాలను నేరుగా తెలుసుకునే అవకాశం కల్గనుంది. జిల్లాల్లో పర్యటించిన ప్రతీసారి సీఎం కేసీఆర్ ముఖ్య నేతలను కలుస్తారు. వారినుంచి ఫీడ్‌బ్యాక్ తెలుసుకుంటారు. ఇప్పుడు ఎన్నికల ఏడాది కావడంతో ఈ విధానం పార్టీకి, ప్రభుత్వానికి ఎంతో మేలు చేయనున్నది.
ఇప్పటివరకు జరిగిన జిల్లాల పర్యటనల్లో ప్రారంభోత్సవాలే కాకుండా భారీ బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. పార్టీ కీలక నేతలతో సమీక్షలు నిర్వహించి గ్రూపు తగాదాలు తలెత్తకుండా పార్టీ విజయానికి మార్గనిర్దేశం చేశారు. తాజా పర్యటనలతో తెలంగాణ ప్రహభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్దిదారులు చేరుతున్న తీరు..వాటిపై ప్రజల అభిప్రాయం, పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో జరుగుతున్న చర్చ వంటి వాటిని స్వయంగా తెలుసుకునేలా జిల్లాల టూర్ కొనసాగనుంది. రాష్ట్రంలో 31 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు పూర్తి చేశారు. 2020 డిసెంబర్ 10న సిద్దిపేటలో తొలి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ దఫా పర్యటనల్లో దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పుకు బీఆర్ఎస్కు ప్రజలు ఆశీర్వాదం తెలుపాలని కోరడంతోపాటు తెలంగాణలో మూడోసారి అధికారం లక్ష్యంగా ఆయన కీలక చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఆయన వ్యూహాలను ఖరారు చేస్తున్నారని తెలిసింది.