హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. కేంద్రప్రభుత్వం, ప్రధాని మోడీ తెలంగాణ పట్ల అనుసరిస్తున్న వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీపై, కేంద్రంపై యుద్ధం చేసేలా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కార్యాచరణ నిర్దేశించనున్నారు. మంగళవారం టీఆర్‌ఎస్ ఎల్పీ, పీపీ కీలక సమావేశం తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేశారు. ఈ సమావేశంపై టీఆర్‌ఎస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మునుగోడు బైపోల్ విజయంతో ఉత్సాహంగా ఉన్న గులాబీ దళపతి తన వ్యూహాలకు మరింత పదునుపెడుతున్నారు.
ఎమ్మెల్యేలందరినీ నియోజకవర్గాల్లోనే ఉండాలని ఆదేశించనున్న సీఎం కేసీఆర్ అవసరమైతే ముందస్తు సంకేతాలు కూడా ఇవ్వవచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరో ఏడాదిలో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉండగా, దళితబంధు మరో విడతకు సంబంధించి ఇప్పటికే ఆదేశాలిచ్చారు. ఎమ్మెల్యేలకు ఇంటినిర్మాణానికి నిధులకు సంబంధించిన స్కీంపై కూడా స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. వచ్చే అసెంబ్లి ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని, ఎన్నికలు ఎపుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని సీఎం సూచించే అవకాశముంది. కొత్త పొత్తులు, నయా రాజకీయాలతో టీఆర్‌ఎస్‌లో ఉత్సా#హం కనిపిస్తుండగా, బీఆర్‌ఎస్ ప్రకటన తర్వాత నిర్వహిస్తున్న సమావేశం కావడంతో దీనిపై ఆసక్తి నెలకొంది.
భారత్ రాష్ట్ర సమితి కార్యాచరణ, కార్యకలాపాలపై కూడా ఈ సమావేశంలో సీఎం వివరించే అవకాశాలున్నాయి. మునుగోడులో సమిష్టిగా మంచి విజయం అందుకున్నామని, తెలంగాణపై కేంద్రం కుట్రలను సమర్ధంగా తిప్పికొట్టామని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో సరికొత్త వ్యూహాలు, కార్యాచరణపై చర్చించి నేతల్లో కేసీఆర్ భరోసానింపే అవకాశాలున్నాయి.
దాడులు.. కుట్రలు
టీఆర్‌ఎస్, మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు లక్ష్యంగా కుట్రపూరితంగా దాడులు జరుగుతున్నాయని, రానున్న రోజుల్లో ఇవి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని.. వీటిని ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు నేతలకు నిర్దేశించారు. తాజాగా మంత్రి కమలాకర్, ఎంపీ రవిచంద్రలపై జరిగిన ఐటీ, ఈడీ దాడులు, పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌లను ప్రలోభపెట్టేందుకు చేసిన కుట్రలపై సీఎం తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.
ఇలాంటివి మరికొన్ని జరిగే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని సీఎం నిర్దేశించనున్నట్లు తెలిసింది. ఇంతకు మించి ఏం చేయలేరని, తెలంగాణలో హ్యాట్రిక్ ఖాయమని, దేశ రాజకీయాల్లోనూ తిరుగులేని ప్రభావం చూపబోతున్నామని కార్యాచరణను.. కర్తవ్యాన్ని సీఎం నిర్దేశించనున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేలతో జరిపిన బేరసారాల వ్యవహారంపై సిట్ విచారణ జరుపుతుండగా, రానున్న రోజుల్లో మరింత దూకుడుగా నిర్ణయాలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ప్రకటించిన సమావేశంపై టీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ, ఆసక్తి నెలకొంది.