పటాన్ చెరు, (ప్రభ న్యూస్): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో శుక్రవారం రాత్రి ఘోరం జరిగింది. ఐడీఐ బొల్లారంలో అమర్ ల్యాబ్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. కార్మికులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జిన్నారం మండల కేంద్రంలోని ఐడీఏ బొల్లారంలో ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకువచ్చి పరిశ్రమ యాజమాన్యాలు వెట్టిచాకిరి చేస్తున్నాయి.
కార్మికులకు ఎలాంటి సేఫ్టీ లేకుండా ఇష్టారాజ్యంగా హార్డ్ వర్క్ చేయిస్తున్నట్టు తెలుస్తోంది. పరిశ్రమలో కెమికల్ సాల్వెంట్ల మిక్సింగ్ తో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. కార్మికులకు కనీస సౌకర్యాలు , ఎలాంటి సేఫ్టీ లేకుండా పరిశ్రమలు నడిపిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, కార్మికుల కుటుంబాలు కోరుతున్నాయి.
అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. పరిశ్రమలలో సేఫ్టీ పరికరాలు ఉన్నాయా, లేవా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కాస్త సీరియస్గా తీసుకుని రూల్స్ పాటించని పరిశ్రమలపై యాక్షన్ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.