Monday, November 25, 2024

TS | అత్యాధునిక పద్ధతుల్లో వ్యర్థాల రీ-సైక్లింగ్‌.. గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు వెల్లడించిన ప్రభుత్వం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అన్ని అంశాల్లో తెలంగాణ ఇతరులకు ఆదర్శమే అవుతోంది. ఏ రంగంలో చూసినా, ఏ శాఖలో విప్లవాత్మక పద్ధతులైనా కొత్తధనంగానే నిలుస్తున్నాయి. ఈ కోవలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటి నుంచి రాష్ట్రంలో ఘన వ్యర్థాల నిర్వహణ తీరు పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో ఇప్పటికే 2 కోట్ల టన్నుల మేర వివిధ రకాల వ్యర్థాలు డంపింగ్‌ యార్డుల్లో పేరుకుపోగా రోజూ కొత్తగా వేల టన్నుల్లో ఘన వ్యర్థాలు ఉత్పత్తవుతున్నాయి.

వీటి నిర్వహణకు బయోమైనింగ్‌ లాంటి అధునాతన పద్ధుతులను వాడి పర్యావరణ సమతుల్యతకు కృషి చేస్తున్నామని ఇటీవల ప్రభుత్వం ఒక కేసులో గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు వెల్లడించింది. ఒక్క హైదరాబాద్‌ నగరంలో 1.2 కోట్ల టన్నుల చెత్త నిల్వ ఉండగా మిగిలిన పట్టణాల్లోని డంపింగ్‌ యార్డుల్లో మరో 70 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని తెలిపింది. ఇది కాక రోజుకు కొత్తగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మునిసిపాలిటీల్లో కలిపి 10 వేల టన్నుల చెత్త ఉత్పత్తవుతోందని వెల్లడించింది.

బయోమైనింగ్‌ ప్రక్రియకుగాను రాష్ట్రంలోని పురపాలికలను 5 క్లస్టర్లుగా విభజించి వ్యర్థాల నిర్వహణ చేస్తున్నారు. ఇక చెత్త సేకరించే పాయింట్ల వద్దే సెగ్రిగేషన్‌ పద్ధతిని జీహెచ్‌ఎంసీలో 15 శాతం అమలు చేస్తుండగా మిగిలిన పురపాలికల్లో 39 శాతం దాకా అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ట్రిబ్యునల్‌కు తెలిపింది. మెట్రోపాలిటన్‌ నగరంగా ఉన్న హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఘన వ్యర్థాల నిర్వహణపై పురపాలక మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో స్పష్టమైన విజన్‌తో ముందుకు వెళుతోంది.

ఈ క్రమంలోనే ప్రస్తుతం నగరంలో రోజుకు 5000 టన్నుల చొప్పున వెలువడుతున్న వివిధ రకాల ఘన వ్యర్థాల రీసైక్లింగ్‌కు ప్రభుత్వం ప్రత్యేక వ్యూహాలు అవలంబిస్తోంది. 2012 నుంచి ఇప్పటి వరకు 75లక్షల19వేల278మెట్రిక్‌ టన్నుల ఘన వ్యర్థాలను శుద్ధి చేసి రీ సైక్లింగ్‌ చేశారు. అయితే ఈ ప్లాంటులో చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేసే 48 మెగావాట్ల సామర్థ్యం ఉండగా గతేడాది దాకా 18 మెగావాట్ల విద్యుత్‌ మాత్రమే ఉత్తత్తి చేశారు. పురపాలక మంత్రి కేటీఆర్‌ చొరవతో ఈ ప్లాంటు సామర్థ్యాన్ని పెంచుకునే ప్రక్రియను పూర్తి చేసిన కాంట్రాక్టు కంపెనీ రాంకీ ప్రస్తుతం 48 మెగావాట్ల పూర్తిస్థాయి విద్యుత్‌ను ఉత్తత్తి చేస్తోంది.

- Advertisement -

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డులో క్యాపింగ్‌…

హైదరాద్‌లో వెలువడే చెత్తలో ఎక్కువ భాగం డంప్‌ చేస్తున్న జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు చుట్టుపక్కల ప్రజలు నివాసం ఉండలేని పరిస్థితి తెలంగాణ ఏర్పడ్డ కొన్ని రోజుల వరకు ఉండేది. పురపాలక మంత్రి కేటీఆర్‌ చొరవతో రూ.144 కోట్ల అంచనాతో పురపాలకశాఖ జీహెచ్‌ఎంసీ ఈ డంపింగ్‌ యార్డుపై క్యాపింగ్‌ చేసింది. ఈ క్యాపింగ్‌ ప్రక్రియతో జవహర్‌నగర్‌ చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రస్తుతం దుర్వాసన రావడం చాలా వరకు తగ్గిపోయినట్లు అధికారులు ఎన్‌జీటీకి వెల్లడించారు.

రోజుకు 1500 టన్నుల సీఅండ్‌డీ వ్యర్థాలు రీ సైక్లింగ్‌…

మంత్రి కేటీఆర్‌ గతేడాది ప్రారంభించిన రోజుకు 500టన్నుల సామర్థ్యం కలిగిన హైదరాబాద్‌ జీడిమెట్లలోని భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్‌ ప్లాంటు 2018 నుంచే నిర్వహణలో ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ప్లాంటు 2018-19 సంవత్సరంలో 4లక్షల48వేల576 టన్నుల భవన వ్యర్థాలు రీసైక్లింగ్‌ చేయగా 2019-20లో 9లక్షల16వేల322 టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేసింది. దీనికితోడు ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని ఫతుల్లగూడలో ఇటీవల అందుబాటులోకి వచ్చిన మరో భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్‌ ప్లాంటుతో కలిపి నగరంలో రోజుకు 1500 టన్నుల చొప్పున ఉత్తత్తి అవుతున్న సీఅండ్‌డీ వ్యర్థాలు శుద్ధి అవుతున్నాయి.

2041కల్లా హైదరాబాద్‌లో రోజుకు 11960 టన్నుల ఘన వ్యర్థాలు..

మరో 20 సంవత్సరాల్లో హైదరాబాద్‌ జనాభా పెరిగిపోయి 2041కల్లా నగరంలో రోజుకు 11960 టన్నుల ఘన వ్యర్థాలు విడుదలవుతాయని ఒక నివేదిక చెబుతోంది. ఇంత భారీ మొత్తంలో చెత్తను రీ సైక్లింగ్‌ చేయాలంటే అంతే మేరకు రీసైక్లింగ్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పలు రకాల వ్యర్థాలను దేనికదే ప్రత్యేకంగా రీసైక్లింగ్‌ చేసే విధంగా ప్లాంట్లు నెలకొల్పే పనిలో అధికారులు ఉన్నారు. మంత్రి కేటీఆర్‌ ఈ విషయంలో మార్గనిర్దేశం చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement