హైదరాబాద్, ఆంధ్రప్రభ : కృష్ణా జలాల పంపిణీ ట్రిబ్యునల్ అవార్డు ఇంకా అమల్లోకి రాకముందే ఏపీ ప్రభుత్వం రాజోలిబండ డైవెర్షన్ స్కీమ్(ఆర్డీఎస్) కుడి కాలువ పనులు కొననసాగించడం అక్రమమని కష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) చైర్మన్‌కు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేఆర్‌ఎంబీకి తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ ఛీఫ్(ఈఎన్‌సీ) మురళీధర్ మంగళవారం ఒక లేఖ రాశారు. గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ విషయమై కేఆర్‌ఎంబీకి ఎన్నో లేఖలు రాసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో తెలిపారు.
ఆర్డీఎస్ కుడి కాలువకు సంబంధించి రెగ్యులేటర్ పనులు కూడా పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఇంతే కాకుండా ప్రస్తుతం ఆర్డీఎస్ కుడికాలువ సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను కూడా ఏపీ సీడబ్ల్యూసీ, కేఆర్‌ఎంబీకి సమర్పించిందని ఈఎస్‌సీ లేఖలో గుర్తుచేశారు. ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం కృష్ణా జలాల పున పంపిణీ పూర్తయ్యేదాకా, సుప్రీంకోర్టులో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ఉన్న కేసులు పరిష్కారం అయ్యే దాకా రాజోలిబండ కుడికాలువ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ పరిశీలన నిలిపివేయాలని కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు మురళీధర్ విజ్ఞప్తి చేశారు.