ఐపీఎల్‌లో 2021 సీజనల్ ఆర్సీబీ హవా కొనసాగుతోంది. మంగళవారం ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు ఒకే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. హోరాహోరీ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పైచేయి సాధించింది. ఫలితంగా విజయాల సంఖ్యను 5కు పెంచుకుని 10 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆరు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీకి ఇది రెండో ఓటమి. 8 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ ముందుంచిన 172 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విజయానికి రెండు పరుగుల ముందు బోల్తాపడింది. ఆఖరి ఓవర్‌లో ఢిల్లీకి 14 పరుగులు అవసరం కాగా సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ వేసి ఢిల్లీని కట్టడి చేశాడు. తొలి నాలుగు బంతులకు నాలుగు పరుగులు మాత్రమే రాగా, అయిదో బంతిని పంత్ ఫోర్ కొట్టాడు. దీంతో ఢిల్లీ విజయానికి చివరి బంతికి ఆరు పరుగులు అవసరమయ్యాయి. సిరాజ్ ఆఫ్‌స్టంప్‌కు ఆవల వేసిన బంతిని పంత్ ఫోర్ మాత్రమే కొట్టడంతో విజయానికి రెండు పరుగుల ముందు ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లలో పృథ్వీషా 21, కెప్టెన్ రిషభ్ పంత్ 58 (నాటౌట్), మార్కస్ స్టోయినిస్ 22, షిమ్రన్ హెట్మెయిర్ 53 (నాటౌట్) పరుగులు చేశారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.డివిలియర్స్ 42 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులు చేయగా, రజత్ పటీదార్ 31, మ్యాక్స్‌వెల్ 25, పడిక్కల్ 17 పరుగులు చేశారు. కెప్టెన్ కోహ్లీ (12) మరోమారు నిరాశపరిచాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన డివిలియర్స్‌కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు లభించింది. నేడు చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఢిల్లీలో మ్యాచ్ జరగనుంది.