Tuesday, November 19, 2024

ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు.. ఒత్తిడిలో దేశ ఆర్థిక వ్యవస్థ

ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపునకు టైమ్‌ అలాంటిదని, సంస్థ తీసుకున్న నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేయలేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. పరిస్థితులు అలాంటివి అని వ్యాఖ్యానించారు. కేంద్ర రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల కీలక రెపో రేటు 40 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ఈ అంశంపై మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్‌బీఐ చర్యతో ప్రభుత్వం తలపెట్టిన మౌలిక సదుపాయాల పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం ఉండబోదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా చర్య తద్వారా పెరిగిన క్రూడాయిల్‌ ధరల ప్రభావంతో.. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిందని తెలిపారు. దీంతో 2018 ఆగస్టు తరువాత తొలిసారి ఇటీవల రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచిందని గుర్తు చేశారు. రెండు నెలలకు ఒకసారి నిర్వహించే ఎంపీసీ పరపతి విధాన కమిటీ సమావేశానికి ముందే ఆర్‌బీఐ ఈ నిర్ణయం వెలువరించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ప్రజలు ఊహించనిదైతే కాదు..

ఆర్బీఐ నిర్ణయమం అనూహ్యమైనది కావొచ్చు అని, ప్రజలు ఊహించనిదైతే కాదన్నారు. రెండు ఎంపీసీల భేటీల మధ్య ఈ నిర్ణయం వెలువడటం ఒక్కటే అనూహ్యమైందన్నారు. పెంపు గురించి ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు ఎప్పటి నుండో చెబుతోందని గుర్తు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచించే ఆర్‌బీఐ రెపో రేటును పెంచిందన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థపై కొంత ప్రభావం చూపుతున్నాయన్నారు. ఆర్థిక వ్యవస్థ కొంత ఒత్తిడి ఎదుర్కొంటున్నదని, అయినా కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ సరైన నిర్ణయాలు తీసుకుంటూ ధరలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని స్పష్టం చేశారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణమే.. దేశ ఆర్థిక వ్యవస్థను కొంత ఆందోళనకరంగా మారుస్తుందని వివరించారు. ధరలు అదుపులోకి వస్తే.. సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నిర్మలా సీతారామన్‌ అభిప్రాయపడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement