Tuesday, November 26, 2024

బ్యాంక్‌ల్లో లోపాలపై ఆర్బీఐ నజర్‌

మార్గదర్శకాలు ఉన్నప్పటికీ కొన్ని బ్యాంక్‌ల్లో పాలనపరమైన లోపాలు కనిపిస్తున్నాయని, ఇది ఆందోళన కలిగించే అంశమని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ హెచ్చరించారు. ఇది బ్యాంకింగ్‌ రంగంలో కొంత అస్థిరతకు కారణమయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కొన్ని బ్యాంక్‌లు ఒత్తిడిలో ఉన్న తమ ఆస్తుల వాస్తవ స్థితిని దాచడానికి ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన సోమవారం నాడు చెప్పారు. కొంత మంది రుణదాతలకు సంబంధించిన లోపాలను గుర్తించినట్లు తెలిపారు. ఆర్బీఐ పర్యవేక్షిస్తున్న సమయంలో ఒత్తిడికి గురైన రుణాల వాస్తవ స్థితిని దాచడానికి వినూత్న మార్గాలను ఉపయోగిస్తున్నట్లు తాము గమనించామని ఆయన ముంబైలో ప్రైవేట్‌ రంగ రుణదాతల కోసం ఆర్బీఐ నిర్వహించిన బ్యాంక్‌ల డైరెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ శక్తికాంతదాస్‌ ఈవిషయం చెప్పారు.

కార్పోరేట్‌ గవర్నెస్‌పై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ ఇలాంటి గ్యాప్స్‌ తమ దృష్టికి వచ్చాయని, బ్యాంక్‌ల బోర్డులు, మేనేజ్‌మెంట్‌ ఇలాంటివాటిని నివారించాలని, ఏ విధంగానూ ఇలాంటి వాటిని అనుమతించకూడదని ఆయన స్పష్టం చేశారు. వృద్ధి విషయంలో అధిక దూకుడు, క్రెడిడ్‌, డిపాజిట్‌ సంబంధిత అంశాల్లో తక్కువ ధర, లేదా ఎక్కువ ధర, సరైన కేంద్రీకరణ లేకపోవడం, డిపాజిట్‌, క్రెడిట్‌ ఫ్రొఫైల్‌లో తగిన వైవిధ్యం లేకపోవడం వల్ల బ్యాంక్‌లు అధిక నష్టాలు, బలహీనతలకు గురవుతాయని ఆయన హెచ్చరించారు.

- Advertisement -

కొన్ని బ్యాంక్‌ల బిజినెస్‌ వ్యూహాల విషయంలో రిజర్వ్‌

బ్యాంక్‌ ఎప్పటికప్పుడు తగిన సర్దుబాటుకు కృషి చేసిందని ఆయన చెప్పారు. క్రెడిట్‌, డిపాజిట్ల విషయంలో కొన్ని బ్యాంక్‌లు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నాయని, ఇలాంటివి సమస్యలను సృష్టిస్తాయని ఆయన చెప్పారు. కోవిడ్‌, రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం వంటి సమస్యల నుంచి బ్యాంకింగ్‌ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనేందుకు కొంత కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఆర్ధిక, కార్యాచరణ, స్థితిస్థాపకతను కొనసాగించగలిగాయని చెప్పారు. ప్రస్తుతం మన బ్యాంకింగ్‌ రంగం చాలా బలంగా, స్థిరంగా ఉందన్నారు.

క్యాపిటల్‌ టూ రిస్క్‌ అసెట్‌ రేషియో (సీఆర్‌ఏఆర్‌) 16.1 శాతంగా ఉందన్నారు. గ్రాస్‌ ఎన్‌పీఏలు 4.41 శాతం, నెట్‌ ఎన్‌పీఏలు 1.16 శాతంగా ఉన్నాయన్నారు. బ్యాంక్‌ల పాలన విధానాలు అత్యంత మెరుగైనవిగా తీర్చిదిద్దడంలో బ్యాంక్‌ల ఛైర్మన్లు, బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌, పార్ట్‌ టైమ్‌ డైరెక్టర్ల ప్రధాన భాద్యత అని ఆర్బీఐ గవర్నర్‌ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement