ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టిన ఆర్బీఐ గతంలో వరసగా మూడు సార్లు 50 బేసిస్ పాయింట్ల చొప్పున వడ్డీ రేట్లు పెంచింది. తాజాగా మరోసారి కూడా వడ్డీ రేట్లు పెంచే సూచనలు ఉన్నాయి. అయితే ఈ సారి మాత్రం తక్కువ స్థాయిలో 25-35 బేసిస్ పాయింట్ల మధ్యలో వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. బుధవారంనాడు ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వడ్డీ రేట్ల పెంపుదలపై చర్చించనున్నారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినందున ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ ఈ విషయంలో కాస్త నెమ్మదించే సూచనలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ సమావేశం 5వ తేదీన ప్రారంభమై 7న ముగుస్తుంది.
అదే రోజు వడ్డీ రేట్ల పెంపుదలపై ఆర్బీఐ గవర్నర్ ప్రకటన చేయనున్నారు. దేశీయ పరిస్థితులతో పాటు, అమెరికా ఫెడరల్ బ్యాంక్ నిర్ణయాలను అనుసరించి కూడా ఆర్బీఐ దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్బీఐ వరసగా మూడు సార్లు వడ్డీ రేట్లు పెంచడంతో ఇది 190 బేసిస్ పాయింట్ల వరకు పెరిగింది. ద్రవ్యోల్బణం 6 శాతం లోపుగా ఉండాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికీ దీని కంటే అధికంగానే ద్రవ్యోల్బణం నమోదవుతోంది. రెండో త్రైమాసికంలో జీడీపీ 6.3 శాతంగా నమోదైంది. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో 13.5 శాతంగా ఉంది.